TS Congress Govt : ప్రజలకు గుడ్ న్యూస్ - పట్టాలెక్కనున్న మరో 2 గ్యారెంటీలు - కీలకమైన పథకాలపైనే ప్రకటన…!-two more guarantees to be implemented immediately says cm revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Congress Govt : ప్రజలకు గుడ్ న్యూస్ - పట్టాలెక్కనున్న మరో 2 గ్యారెంటీలు - కీలకమైన పథకాలపైనే ప్రకటన…!

TS Congress Govt : ప్రజలకు గుడ్ న్యూస్ - పట్టాలెక్కనున్న మరో 2 గ్యారెంటీలు - కీలకమైన పథకాలపైనే ప్రకటన…!

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 01, 2024 09:38 PM IST

CM Revanth Reddy Review : మరో రెండు హామీలను పట్టాలెక్కించే పనిలో పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy: తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ బీమాను రూ. 10 లక్షలకు పెంచింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా పేరుతో దీన్ని అమలు చేస్తోంది. గతంలో ఆరోగ్య శ్రీ హెల్త్ బీమా రూ. 5 లక్షల వరకే ప్రస్తుతం ఇది రూ. 10 లక్షలకు(ఏడాదికి) పెరిగింది. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. మరో రెండు హామీలను కూడా పట్టాలెక్కించే పనిలో పడింది సర్కార్.

గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆరు గ్యారెంటీల హామీల అమలుపై చర్చించారు. ప్రధానంగా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యత్ తో పాటు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అమలుపై సమాలోచనలు చేశారు. కీలకమైన ఈ స్కీమ్ ల అమలు కోసం కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్ కేటాయింపులు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి…. త్వరలోనే రెండు మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఇంద్రవెల్లికి సీఎం రేవంత్

ఇక తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఇంద్రవెల్లిలో (ఫిబ్రవరి 2) జరగబోయే తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభకు హాజరుకానున్నారు. లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు లక్ష మందితో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 1:45 కు కెస్లాపూర్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగోబా ఆలయ దర్శనం అనంతరం పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికి చేరుకుంటారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ జరిగే భారీ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

ఈ సభా వేదికపై నుంచి మరో రెండు గ్యారెంటీ స్కీమ్ లపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మహా లక్ష్మి స్కీమ్ కింద మహిళలకు రూ. 2500 ఇవ్వటం లేదా ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించి ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి.

ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 5 గ్యారంటీలకు 1,09,01,255 దరఖాస్తులు నమోదైనట్లు ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. జనవరి 12వ తేదీ నాటికే రికార్డు టైమ్ లో డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేశారు. కొందరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు డేటా బేస్ ద్వారా గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు ఉన్నట్లు తేల్చారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నెంబర్లు లేకుండా కూడా కొన్ని దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించారు. అసలైన అర్హులు నష్టపోకుండా వీటిని మరోసారి పరిశీలించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఎస్ఈపై బదిలీ వేటు

ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు వచ్చింది. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు..? తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చింది ఎవరు...? అని సమీక్షలో ఉన్న ట్రాన్స్ కో సీఎండీ శ్రీ రిజ్విని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా? లేదా? అని ఆరా తీశారు.

సమావేశంలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి స్పందించి.. రైతుల కరెంట్ కనెక్షన్ల తనిఖీ, సర్వే చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని సీఎంకు వివరించారు. శాఖాపరమైన నిర్ణయమేదీ లేకుండానే డిస్కం డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చాడని, ఆయన ఆదేశాల మేరకు అక్కడున్న ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలోనే డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలిగించామని, ఎస్ఈ అక్కడి నుంచి బదిలీ చేశామని ఉప ముఖ్యమంత్రి జరిగిన సంఘటనను మొత్తం వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి చర్యలు తప్పవని, తమకు తోచినట్లు సొంత నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

Whats_app_banner