TSPSC Group 4 : గ్రూప్‌-4లో థంబ్‌ అటెండెన్స్‌..! ఇవాళ్టి నుంచే హాల్ టికెట్లు-tspsc to release hall tickets for group iv exam june 24 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 4 : గ్రూప్‌-4లో థంబ్‌ అటెండెన్స్‌..! ఇవాళ్టి నుంచే హాల్ టికెట్లు

TSPSC Group 4 : గ్రూప్‌-4లో థంబ్‌ అటెండెన్స్‌..! ఇవాళ్టి నుంచే హాల్ టికెట్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 24, 2023 08:03 AM IST

TSPSC Latest News: ఇవాళ్టి నుంచి గ్రూప్ -4 హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈసారి పరీక్షలో… థంబ్‌ అటెండెన్స్‌ ప్రవేశపెట్టాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ గ్రూప్ - 4 పరీక్ష
తెలంగాణ గ్రూప్ - 4 పరీక్ష

TSPSC Group 4 Hall Tickets: పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన పరీక్షల విషయంలో వేగం పెంచింది తెలంగాణ పబ్లిక్ సర్వీక్ కమిషన్. ఇప్పటికే పలు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించగా... కొన్నింటిని నిర్వహించింది. ఇక భారీగా దరఖాస్తులు వచ్చిన గ్రూప్ - 4 పరీక్ష కూడా జూలై 1వ తేదీన నిర్వహించబోతుంది. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసే పనిలో పడింది కమిషన్. ఇక ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవాళ్టి (జూన్ 24) నుంచే అందుబాటులో రానున్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ ఓ ప్రకటనలో సూచించింది.

థంబ్‌ అటెండెన్స్‌..!

గ్రూప్ - 4 పరీక్షకు 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఫలితంగా ఏర్పాట్లుపై లోతుగా కసరత్తు చేస్తోంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకునే పనిలో పడింది. అయితే ఈ సారి గ్రూప్‌-4లో ప్రయోగాత్మకంగా థంబ్‌ అటెండెన్స్‌ తీసుకోవాలని యోచిస్తోంది. బయోమెట్రిక్‌కు ఒక్కో అభ్యర్థికి సుమారు 30 నుంచి 40 సెకన్ల సమయం పడుతుండగా…. అదే థంబ్‌కి 5 నుంచి 10 సెకన్లలోనే పూర్తవుతుందని భావిస్తోంది. అయితే ఈ విధానం అమలుపై కమిషన్ ఆలోచిస్తోంది. టెక్నీషియన్ల అభిప్రాయాలు స్వీకరించటంతో పాటు… అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా..? వంటి అంశాలపై చర్చించి రేపోమాపో అధికారికంగా క్లారిటీ ఇవ్వనుంది. గ్రూప్ - 4 పరీక్షపై శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన కమిషన్… పరీక్షల పర్యవేక్షణ, సిబ్బంది విధులు, పోలీసుల పటిష్ట బందోబస్తు వంటి పలు అంశాలపై చర్చించింది.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి…

అభ్యర్థులు మొదటగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

గ్రూప్ - 4 హాల్ టికెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

టీఎస్పీెస్సీ ఐడీ, మీ పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

ఎంట్రీ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 8,180 గ్రూప్‌-4 సర్వీసులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 9.51 లక్షల మంది హాజరుకానున్నారు. టీఎస్‌పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేయడం ఇది రెండో సందర్భం. 2018లో 700 వీఆర్‌వో ఉద్యోగాలకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేయగా, 7.9 లక్షల మంది పరీక్ష రాశారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున ఒక్కోపోస్టుకు 116 మంది పోటీపడనున్నారు. అయితే పేపర్ లీక్ వంటి ఘటనల నేపథ్యంలో... సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టనున్నారు. అభ్యర్థులకు కూడా కీలక సూచనలు ఇవ్వనుంది కమిషన్.

జులై 1వ తేదీన పరీక్ష…

జులై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-4లో మొత్తం ఉద్యోగాల సంఖ్య 8180 కాగా.. ఇప్పటివరకు 8039గా ఉన్న ఖాళీల సంఖ్య మహాత్మాజ్యోతిభాపూలే బీసీ సంక్షేమ హాస్టళ్లకు మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జోడించారు. దీంతో 289గా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 430కు చేరాయి. అదేవిధంగా మొత్తం గ్రూప్-4 ఉద్యోగాల సంఖ్య 8180కు చేరింది. ఈ పరీక్షలో పేపర్-1 (జనరల్ స్టడీస్)-150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. ప్రశ్నలను ఆబ్జెక్టివ్ విధానంలోనే అడుగుతారు.

Whats_app_banner

సంబంధిత కథనం