Bathukamma Sarees : తెలంగాణ ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. కోటి బతుకమ్మ చీరల పంపిణీ-ts govt to distribute 1 crore bathukamma sarees across state ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ts Govt To Distribute 1 Crore Bathukamma Sarees Across State

Bathukamma Sarees : తెలంగాణ ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. కోటి బతుకమ్మ చీరల పంపిణీ

HT Telugu Desk HT Telugu
Aug 24, 2022 04:17 PM IST

తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

బతుకమ్మ చీరలు
బతుకమ్మ చీరలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్వల్ప వ్యవధిలో 1.20 కోట్ల జాతీయ జెండాలను అందించిన చేనేత జౌళి శాఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబరు మూడో వారం నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే నేత కార్మికులతో కోటి చీరల తయారీకి ఆర్డర్లు ఇవ్వగా దాదాపు 85 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ చీరలను సిరిసిల్లలో 20,000 మంది పవర్‌లూమ్ నేత కార్మికులు తయారు చేశారు. ప్రతి రోజు గడువుకు అనుగుణంగా సుమారు లక్ష చీరలు తయారు చేస్తున్నారు. కొరత లేకుండా చూసేందుకు 3 లక్షల చీరల బఫర్ స్టాక్‌ను నిర్వహించడం జరిగిందని చేనేత జౌళి శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

గతేడాది మాదిరిగానే చీరల డిజైన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది 17 రకాల రంగుల్లో 17 రకాల డిజైన్లను నేయడం జరిగింది. దాదాపు 90 శాతం చీరలు సిరిసిల్లలో తయారవుతుండగా మిగిలినవి కరీంనగర్‌లో తయారవుతున్నాయి. సెప్టెంబర్ 25 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. బతుకమ్మ చీరల వార్షిక పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.330 కోట్లు కేటాయించింది.

సిరిసిల్లలో చీరల తయారీ పూర్తయితే వాటిని ఫినిషింగ్, సార్టింగ్, ప్యాకింగ్ కోసం హైదరాబాద్‌కు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం పొందిన తర్వాత జిల్లాలకు పంపిణీ చేస్తామని అధికారి వివరించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి, లేదా పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ కార్యాలయాల్లో చీరలను పంపిణీ చేసే అవకాశం ఉంది.

2017 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన మహిళలకు బతుకమ్మ చీరలను ఏటా పంపిణీ చేస్తోంది. దీని ప్రకారం, 2017లో 95 లక్షలు, 2018లో 96.7 లక్షలు, 2019లో 96.5 లక్షలు, 2020లో 96.24 లక్షలు, 2021లో 96.38 లక్షలకు పైగా చీరలు పంపిణీ జరిగింది. చేనేత కార్మికులే కాకుండా కూలీలు, హమాలీలు, ఆటో డ్రైవర్లు, వ్యాపారులు సహా అనుబంధ కార్మికులు కూడా ప్రభుత్వం జారీ చేసిన బతుకమ్మ చీరల ఆర్డర్‌ల ద్వారా లబ్ధి పొందుతున్నారు.

సంవత్సరాల వారీగా బతుకమ్మ చీరల పంపిణీ వివరాలు

2017 – 95,48,439

2018 – 196,70,474

2019 – 96,57,813

2020 – 96,24,384

2021 – 96,38,000

WhatsApp channel