MLAs Poaching Case: ఎర కేసు బదిలీని ఆపండి.. హైకోర్టులో సర్కార్ అప్పీల్ పిటిషన్ !
TS Govt Filed Appeal Petition On MLAs Case: ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తెలంగాణ సర్కార్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.
TS HC On MLAs Poaching Case: సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏకంగా సిట్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వటమే కాకుండా... కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు 98 పేజీలతో కూడిన తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది. కేసును సీబీఐకి ఇవ్వడానికి గల కారణాలను 45 అంశాల రూపంలో వివరించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ కాస్త సీబీఐ పరిధిలోకి వెళ్లటంతో... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు (ఎఫ్‌ఐఆర్ నంబర్ 455/2022) సీబీఐకి బదిలీ చేయడాన్ని ఆపాలని పిటిషన్‌లో కోరింది తెలంగాణ సర్కార్. జీవో 63 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ మేరకు సిట్ దర్యాప్తు సాగించాలని డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు పలు వివరాలను పిటిషన్ లో ప్రస్తావించింది.
ఎమ్మెల్యేల కేసును విచారిస్తున్న సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో నెంబర్ 63ను రద్దు చేయటమే కాకుండా... తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది. 98 పేజీలతో కూడిన సుదీర్ఘమైన ఆర్డర్ కాపీలో సిట్ రద్దు సహా.. ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వటం, సీబీఐకి అప్పగించటం వంటి అంశాలను పేర్కొంది. కేసు విచారణ కోసం ఏర్పాటైన సిట్ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని ప్రస్తావించింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేటంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్ దర్యాప్తు సక్రమంగా జరిగినట్లు అనిపించట్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆధారాలన్నీ మీడియా, ప్రజల వద్దకు వెళ్లాయని ఉన్నత న్యాయస్థానం తీర్పులో ప్రస్తావించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనన్న కోర్టు... సీఎంకి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని స్పష్టం చేసింది. సిట్ చేసిన దర్యాప్తు పారదర్శకంగా అనిపించలేదని... దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని స్పష్టం చేసింది. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఎఫ్ఐఆర్ 455/2022 సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు తీర్పులో వెల్లడించింది. కేసును సీబీఐకి దాఖలు చేయాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పక్కన పెట్టామని..నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను మాత్రం పరిగణలోకి తీసుకున్నట్లు తీర్పులో హైకోర్టు వివరించింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఎర కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఓవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈడీ విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి కూడా బీజేపీ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫిర్యాదు చేసిన తనపై కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పై డివిజన్ తీర్పు ఎలా ఉంటుందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైతే సీబీఐ ఏంట్రీ ఇవ్వటం ఖాయమే..!