TG CM Revanth reddy: సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్సార్ పేరే… తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి-the name ysr is remembered for welfare telangana cm revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Cm Revanth Reddy: సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్సార్ పేరే… తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

TG CM Revanth reddy: సంక్షేమం అంటే గుర్తొచ్చేది వైఎస్సార్ పేరే… తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

Sarath chandra.B HT Telugu
Jul 08, 2024 01:52 PM IST

TG CM Revanth reddy: దేశంలో సంక్షేమం అంటే గుర్తు వచ్చే పేరు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డేనని, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వైఎస్ చేసిన సంక్షేమాన్ని గుర్తు చేసుకొని అమలు చేస్తున్నారని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

పంజాగుట్టలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కేవీపీ
పంజాగుట్టలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కేవీపీ

TG CM Revanth reddy: ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపయోగపడుతోందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమంపై వైఎస్ఆర్ ముద్ర ఎంతో ఉందని రేవంత్ కొనియాడారు.

తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు స్ఫూర్తి వైఎస్ఆర్ ఆనాడు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలేనని చెప్పారు. మూసీ, మెట్రో రైల్, గోదావరి కృష్ణా జలాలు, హైదరాబాద్ లో పెట్టుబడులకు కూడా వైఎస్సార్ స్ఫూర్తిగా నిలిచారన్నారు. వైఎస్ స్ఫూర్తిని తమ ప్రభుత్వం, పార్టీ కొనసాగిస్తుందన్నారు.

2009లో రెండోసారి సీఎం అయ్యాక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని సూచించిన వైఎస్ చెప్పిన మాటలు తమకు గుర్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కాకుండానే వైఎస్ మనకు దూరం అయ్యాడని, వైఎస్ స్ఫూర్తి తో దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కొట్లాడి రాహుల్ ని ప్రధాని చేయాలన్నారు.

వైఎస్ ఆనాడు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు చేసిన పాదయాత్ర నే భారత్ జోడో యాత్రకు స్పూర్తిగా నిలిచిందన్నారు. ఆ నాడు వైఎస్ పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చిందని, రాహుల్ పాదయాత్ర తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి తెచ్చిందన్నారు.

రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా రాణిస్తుంటే దేశ ప్రధాని పదవికి ఆయన ఒక అడుగు దూరంలో ఉన్నాడనిపిస్తోందని, రాహుల్ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్ 75 వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు రాహుల్ ప్రధాని కావాలన్న ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు.

రాహుల్ గాంధీ కి పదవులు ముఖ్యం కాదని, ఆయన అనుకుంటే 2004 నుంచి 2014 మధ్య లో పీఎం అయ్యేవారని, రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ప్రస్తుతం దేశానికి ఉందని, రాహుల్ గాంధీ ని ప్రధాని చేయడానికి ఎవరైతే పూనుకుంటారో వారే నిజమైన వైఎస్ఆర్ అభిమానులని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

వైఎస్ అభిమానులంతా కాంగ్రెస్ లోకి రావాలని, 2021 జూలై 7 న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నానని, మూడేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేసిన 35 మంది నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు. ఎలాంటి ఫైరవీలు లేకుండా పార్టీ కోసం పని చేసిన, త్యాగం చేసిన వారికి పదవులు ఇచ్చామన్నారు. కష్టపడిన కార్యకర్తలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్నదే మా ఉద్దేశమన్నారు. కార్యకర్తలను కాపాడుకున్నపుడే పార్టీ బలంగా ఉంటుందని రేవంత్ చెప్పారు.

గాంధీ భవన్‌లో వైఎస్ జయంతి…

హైదరాబాద్‌ గాంధీభవన్‌లో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ స్పూర్తితో ప్రజల కోసం పని చేస్తామని తెలిపారు. వైఎస్ ప్రజల హృదయాల్లో ఉన్నారని భట్టి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదవాళ్ళు కలలో కూడా ఊహించని విధంగా సంక్షేమాన్ని పొందారని గుర్తుచేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.

వచ్చే రెండు దశాబ్దాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం నాయకులందరం కలిసికట్టుగా ఉందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో భారీ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తల ఎత్తుకొని తిరిగేలా చేస్తామన్నారు.

కాంగ్రెస్ పాత నాయకులందరూ పార్టీలోకి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీకి 26 ఎమ్మెల్యేల నుండి 90 ఎమ్మెల్యేలను తెచ్చిన ఘనత వైఎస్‌దే అని కాంగ్రెస్ నేత కేవీపీ పేర్కొన్నారు. పాదయాత్రతో వైఎస్ చరిత్ర సృష్టించారన్నారు. పేదల గుండెల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారని చెప్పారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలో జరిగే వైఎస్ 75వ జయంతిలో రేవంత్, తెలంగాణ మంత్రులు పాల్గొంటారు.

WhatsApp channel