TS Electricity Charges: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నియంత్రణ మండలి నిరాకరణ, ఫిక్సిడ్ ఛార్జీల పెంపుకు నో
TS Electricity Charges: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. విద్యుత్ బిల్లుల్లో ఫిక్సిడ్ ఛార్జీల పెంపుతో పాటు ధరల పెంపు ప్రతిపాదనల్ని నిరాకరించింది. దీంతో ఈ ఏడాదికి వినియోగదారులపై అదనపు భారం పడకపోవచ్చు.
TS Electricity Charges: తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. హైటెన్షన్ వర్గాలకు కరెంట్ చార్జీలను హేతుబద్ధీకరించడంతో పాటు, వివిధ వర్గాలకు కనెక్షన్లపై వేసే ఫిక్సిడ్ ఛార్జీలను పెంచాలని.. విద్యుత్ పంపిణీ సంస్థలు చేసిన ప్రతిపాదనలను టీజీ ఈఆర్సీ తిరస్కరించింది. విద్యుత్ బిల్లుల్లో కనీస నెలవారీ చార్జీల విధానాన్ని తొలగించాలని ఆదేశించింది.
800 యూనిట్లకు పైబడి విద్యుత్ వినియోగించేవారికి మాత్రం స్థిరచార్జీలను ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.50కి పెంచడానికి అనుమతిచ్చింది. ఈఆర్‌సీ నిర్ణయం నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు దాఖలు చేసిన వార్షిక ఆదాయం, అవసరాల వివరాలపై అక్టోబర్ 23, 24 తేదీల్లో ఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించింది. విద్యుత్ ధరలపై దాఖలైన 8పిటిషన్లపై సోమవారం ఉత్తర్వులు వెలువరించింది.
కరెంటు చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించింది. చార్జీల పెంపు ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల ఆదాయం పెంచుకోడానికి అనుమతి కోరగా అందులో రూ.1170 కోట్లు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో రూ.30 కోట్ల వరకు మాత్రమే ఛార్జీల సవరణకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది.
తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను దాదాపుగా తిరస్కరించినట్లు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారు. ఈఆర్సీ సభ్యులు మనోహర్రాజు, కృష్ణయ్యలతో కలిసి ఉత్తర్వులను వెలువరించారు.
- గృహ వినియోగంలో నెలకు 300 యూనిట్లు దాటితే స్థిరఛార్జీని ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.10 నుంచి 50కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అయితే నెలవారీ వినియోగ పరిమితి 800 యూనిట్లు దాటితేనే స్థిరఛార్జీ రూ.10 నుంచి 50కి పెంచడానికి ఈఆర్సీ అనుమతించింది.
- చేనేత, కుటీర పరిశ్రమలకు తీసుకునే కరెంటు కనెక్షన్ కనీస లోడు సామర్ధ్యాన్ని 10 నుంచి 25 హెచ్చీకి పెంచినట్టు తెలిపారు. ప్రస్తుతం 10 హెచ్పీ వరకూ వసూలు చేస్తున్న కనీస ఛార్జీల శ్లాబు వచ్చే నెల 1 నుంచి 25 హెచ్పీకి పెరుగుతుంది. అధునాతన యంత్రాలను వాడుకునే చేనేత, కాటేజ్ పరిశ్రమలకు కరెంటు చార్జీల భారం తగ్గుతుందని వివరించారు.
- రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ కరెంటు వినియోగించుకునేవారికి 'ఆఫ్ పీక్ లోడు' కేటగిరీ కింద యూనిట్‌కు ప్రస్తుతం రూపాయి చార్జీ తగ్గిస్తుండగా.. వచ్చే నెల నుంచి రూపాయిన్నర తగ్గించాలని ఆదేశించారు.
- విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లకు స్థిరఛార్జీ కింద ప్రస్తుతం కిలోవాటక్కు 5.50 వసూలు చేస్తున్నారు. తాజాగా దాన్ని రద్దు చేశారు.
- స్థిరఛార్జీలో భాగంగా ప్రతి కనెక్షన్ నుంచి తప్పనిసరిగా నెలనెలా వసూలు చేసే మొత్తం. దీనిని అన్ని కేటగిరీలకు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా వాటిని ఈఆర్సీ తిరస్కరించింది. పరిమితంగా పెంచడానికి అనుమతించింది.
- ట్రూ అప్ చార్జీలలో డిస్కంల నుంచి రూ.969 కోట్ల వసూలుకు అనుమతించాలని జెన్కో వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఈఆర్సీ తిరస్కరిం చింది. ట్రూడౌన్ కింద జెన్కో డిస్కంలకు రూ. 292 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.
- గ్రిడ్ సపోర్టు చార్జీని కిలోవాట్‌కు నెలకు రూ.19. 37 చొప్పున వసూలు చేస్తామని డిస్కంలు ప్రతి పాదించాయి. రూ.16.32 వసూలుకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది.
- సౌర, పవన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో కొని వినియోగించే వారు ఒకరోజు ముందుగా డిస్కం లకు నోటీసు ఇస్తే వారి నుంచి ఎలాంటి ఛార్జీలను వసూలు చేయకూడదని ఈఆర్సీ ఆదే శించింది.. నోటీసు ఇవ్వకపోతే వారి కరెంటు ఛార్జీలో 10 శాతం అదనంగా వసూలు చేయాలని సూచించింది.