CPS Employees Protest : పాత పింఛన్‌ విధానం అమలు చేయాలి - రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళన-telangana state contributory pension scheme employees union protest against on go 28 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cps Employees Protest : పాత పింఛన్‌ విధానం అమలు చేయాలి - రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళన

CPS Employees Protest : పాత పింఛన్‌ విధానం అమలు చేయాలి - రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళన

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 23, 2024 08:50 PM IST

తెలంగాణలోని ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నిర్ణయం తీసుకోవాలని యూనియన్ సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని అందించారు.

ఉద్యోగుల ఆందోళన
ఉద్యోగుల ఆందోళన

ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఇదే విషయంపై సంఘం ప్రతినిధులు... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి( ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు)ని సచివాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్ రావడానికి కారణాలతో పాటు పాత పెన్షన్ పునరుద్ధరణ అవసరంపై నివేదికను అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ... 2014 లో ఏర్పడిన నాటి ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించకుండానే సీపీయస్ విధానంపై నిర్ణయం తీసుకుందని చెప్పారు. 2014 ఆగస్టు 23న జీవో నెంబర్ 28 ద్వారా ఉత్తర్వులు ఇచ్చి తెలంగాణ ఉద్యోగుల భవితకు ఉరి బిగించిందన్నారు. గత ప్రభుత్వంలో సీపీయస్ విధానాన్ని కొనసాగిస్తూ అగ్రిమెంట్ చేసుకున్న రోజు అయిన ఆగస్టు 23ను బ్లాక్ డేగా పాటిస్తున్నామని చెప్పారు. నాడు ఇచ్చిన జీవో 28 కాపీలను దగ్ఘం చేసి నిరసన వ్యక్తం చేశామని తెలిపారు.

తెలంగాణలో ప్రజాపాలన రావడంలో ముఖ్యభూమిక పోషించిన ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.  ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరచిన విధంగా సీపీఎస్ విధానం రద్దు చేయాలన్నారు. వెంటనే పాత పెన్షన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లోని పాఠశాలలు, కార్యాలయాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఆగష్టు 23ను బ్లాక్ డేగా పేర్కొంటూ జీవో 28 కాపీలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

Whats_app_banner