Nominated Posts: నామినేటెడ్ పదవుల కోసం నేతల ఎదురుచూపులు.. పార్టీ పదవులపై మరికొందరు గంపెడాశలు
Nominated Posts: కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చాయి. పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. దశాబ్దకాలంగా పార్టీ కోసం పని చేసిన నాయకులు పదవులు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
Nominated Posts: తొలి విడత జరిగిన నామినేటెడ్ పదవుల పందేరంలో కరీంనగర్ జిల్లాకు మహిళా కమిషన్ చైర్ పర్సన్, సుడా చైర్మన్ పదవులు దక్కగా.. రానున్న నియామకాల్లో జిల్లా నుంచి మరికొందరికి రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల్లో ప్రాధాన్యత దక్కడం ఖాయమంటూ నేతలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. జిల్లా నేతలందరు మంత్రి పొన్నం ప్రభాకర్ పై భారం వేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
దశాబ్దకాలంపాటు ప్రతిపక్షంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ తమకు తగిన గుర్తింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వ్యక్తమవుతోంది.
పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు ముగిసినా పదవుల భర్తీ గురించి జిల్లా స్థాయిలో కసరత్తు వేగవంతం కాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ప్రకటించడంలో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపిన నేపథ్యంలో తమ సంగతేంటేమిటంటూ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
జిల్లా స్థాయిలో శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవి ఒక్కటి మాత్రమే నియామకం కాగా.. సుడా డైరెక్టర్ల పదవులతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ, వ్యవసాయ మార్కెట్ కమిటీ, దేవాలయాల కమిటీలకు పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, హుజురాబాద్ పరిధిలో నియోజకవర్గ ఇన్ చార్జి వొడితెల ప్రణవ్ బాధ్యతలు తీసుకుంటుండగా.. ప్రధానమైన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
మొదటి నుంచి ఇక్కడ గట్టి పట్టు ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ జరిగే నియామకాలపై దృష్టి సారించాలంటూ కార్యకర్తలు కోరుతున్నారు. ఎటువంటి లాబీయింగ్ చేయకపోతే పదవులు దక్కడం కూడా గగనమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
పెరుగుతున్న నేతల జాబితా.…
నామినేటెడ్ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న తమకే అవకాశం ఇవ్వాలంటూ సీనియర్లు.. పార్టీకి సేవ చేసేందుకు వచ్చిన తమను గుర్తించాలంటూ ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరిన వారు పార్టీ నాయకత్వానికి సూచిస్తున్నారు.
తాజాగా పార్టీలో చేరి చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హెూదాలో ప్రభుత్వ సలహాదారు నియామకం.. ఆయన కుమారుడు అమిత్ రెడ్డికి డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడాన్ని తాజాగా పార్టీలో చేరిన వారు గుర్తు చేస్తున్నారు. పార్టీ ఆహ్వానం మేరకే తాము చేరినందున తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరికాదంటూ వారు కూడా పదవులకు పోటీపడుతుండటంతో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కుతాయోన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పలువురు మహిళా నాయకురాళ్ళు కూడా నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు.
ఇద్దరూ కొత్తవారే..
కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ ఇద్దరు ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారే కావడంతో పార్టీకి సేవలందించిన వారెవరో కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండదని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. పైగా ఇటు అసెంబ్లీ, అటు లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ గట్టిపోటీనివ్వలేక పోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకొని మూడవ స్థానంలో ఉండగా.. లోక్ సభ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కరీంనగర్ కేంద్రంగా పొన్నం ప్రభాకర్ కార్యకలాపాలు కొనసాగిన నేపథ్యంలో పార్టీ పదవులు, నామి నేటెడ్ పదవుల్లో పార్టీ కోసం శ్రమించిన వారికి అవకాశం కల్పించాలంటూ వారు సూచిస్తున్నారు.
నియోజకవర్గ అసెంబ్లీ, లోక్ సభ ఇన్ చార్జిలు తమకు సన్నిహితంగా ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తే పార్టీ కోసం దశాబ్దాలుగా సేవలందిస్తూ వస్తున్న తమ సంగతి ఏమిటంటూ మరికొందరు సీనియర్ కార్యకర్తలు కలవరపడుతున్నారు.
పార్టీ పదవులకు సైతం డిమాండ్ ..
త్వరలోనే జిల్లా అధ్యక్ష పదవి మార్పు తప్పనిసరి కావడంతో పార్టీ పదవుల కసరత్తు కొనసాగే అవకాశం ఉంది. అలాగే నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సుడా చైర్మన్ గా అవకాశం దక్కడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది.
జిల్లా, నగర అధ్యక్ష పదవులతో పాటు అనుబంధ సంఘాలకు కూడా కొత్త అధ్యక్షులను నియమించనుండటంతో మరికొందరు నేతలు ఆయా పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. కరీంనగర్ లో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ .. ఎంపీగా బీజేపీ ప్రతినిధులు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసి రానున్న మున్సిపల్ ఎన్నికల నాటికి ధీటైన స్థితిలో నిలబెట్టాలంటే పార్టీ నాయకత్వం ఇప్పటి నుంచే చొరవ చూపాలంటూ కార్యకర్తలు కోరుతున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారిస్తే తప్ప కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)