Rythu Runa Mafi : రుణమాఫీ నిధులు విడుదల - ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న సీఎం రేవంత్
Telangana Crop Loan Waiver: రుణమాఫీ నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేసింది.
Telangana Crop Loan Waiver: రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. ఇవాళ 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదలయ్యాయి. మొత్తం రైతుల ఖాతాల్లోకి రూ. 6 వేల 98 కోట్ల నిధులు చేరాయి.
ఇక రెండో విడతలో ఈ నెలాఖరులోపే రూ. లక్షన్నర రుణమాఫీ కానుంది. ఆగస్టు దాటక ముందే రూ. 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణమాఫీకి మొత్తం రూ. 31 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సర్కార్ తెలిపింది. రుణమాఫీ నిధులను వేరే అప్పులకు జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ఆదేశించింది.
రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వారి ఇబ్బందులతో పాటు రుణమాఫీ నిధుల జమ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం - సీఎం రేవంత్ రెడ్డి
రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నాడు తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై నుంచి సోనియాగాంధీ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఆ విధంగానే 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు.
గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను తప్పుదోవ పట్టించదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటంలో నాటి ప్రభుత్వం విఫలమైందన్నారు. పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయకపోవటంతో అన్నదాతలు విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో మే 6 2022 నాడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. వీటితో పాటు తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలపై ప్రకటన చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.... రుణమాఫీ చేసేందుకు సిద్ధమైందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఇవాళ్టి నుంచే నిధులను జమ చేస్తోందని పేర్కొన్నారు. తొలి విడతలో భాగంగా 6 వేల 98 కోట్ల రూపాయలను జమ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ సవ్వయంగా జరిగేందుకు సహకరించిన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
“ఇవాళ్టి రోజు నా జీవితంలో మరుపురాని రోజు. ఈరోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే అవకాశం దక్కింది. ఇంతటి అవకాశం వచ్చినందకు చాలా సంతోషంగా ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఓవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నప్పటికీ… వాటిని అధిగమిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగానే అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల కోసమే ఈ ప్రభుత్వమే పని చేస్తుందని చెప్పారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం మోడల్ గా ఉంటుందన్నారు. కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
ఈ నెలఖారులో వరంగల్ వేదికగా రైతుల తరపున కృతజ్ఞత సభను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని తెలిపారు. అనంతరం పలువురు రైతులకు రైతు రుణమాఫీ చెక్కులను అందజేశారు.