T Congress : కాంగ్రెస్ నిరుద్యోగ ఉద్యమం..3 జిల్లాల్లో ర్యాలీలు, హైదరాబాద్ వేదికగా భారీ సభ-telangana congress to plan nirudyoga nirasana rallies in various districts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  T Congress : కాంగ్రెస్ నిరుద్యోగ ఉద్యమం..3 జిల్లాల్లో ర్యాలీలు, హైదరాబాద్ వేదికగా భారీ సభ

T Congress : కాంగ్రెస్ నిరుద్యోగ ఉద్యమం..3 జిల్లాల్లో ర్యాలీలు, హైదరాబాద్ వేదికగా భారీ సభ

HT Telugu Desk HT Telugu
Apr 19, 2023 04:17 PM IST

Telangana Congress Latest News: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ భారీ పోరాటానికి సిద్ధమవుతోంది. పలు జిల్లాల్లో నిరసన ర్యాలీలను తలపెట్టడంతో పాటు సభలను కూడా నిర్వహించబోతుంది. ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ “నిరుద్యోగ నిరసన' ర్యాలీలు
తెలంగాణ కాంగ్రెస్ “నిరుద్యోగ నిరసన' ర్యాలీలు

Telangana Congress Nirudyoga Nirasana Rallies: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశం సంచలనం సృష్టించిన సంగతి తెలుస్తోంది. ఓవైపు సిట్, ఈడీ విచారణ జరుగుతుండగా... మరోవైపు కమిషన్ కొత్త పరీక్ష తేదీలను ప్రకటించే పనిలో పడింది. ఇక ప్రతిపక్ష పార్టీలు.... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. నిరుద్యోగ మార్చ్ ల పేరుతో బీజేపీ కార్యక్రమాలను చేపడుతోంది. మిగతా పార్టీలు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే... తెలంగాణ కాంగ్రెస్ భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పలు జిల్లాల్లో ర్యాలీలు, సభలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. ఇక హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించి... పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీని కూడా రప్పించేలా కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

మే నెలలో భారీ సభ...

నిరుద్యోగులు అంశం, పేపర్ లీకేజీలో వాస్తవాలు, ఉద్యోగాల భర్తీపై బీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 21న నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కేంద్రంగా పోరాటం ప్రారంభించనుంది. వర్సిటీ విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టనుంది. ఇక ఏప్రిల్ 24లో ఖమ్మం, ఏప్రిల్ 26వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోనూ నిరుద్యోగ నిరసన ర్యాలీలను నిర్వహించునుంది. ఇక మే 4 లేదా 5న హైదరాబాద్​ సరూర్​నగర్​లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ సభకు పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ ముఖ్య అతిథిగా రప్పించనున్నారు. ఎల్బీ నగర్​లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించటం... భారీ ర్యాలీగా సరూర్​నగర్​ స్టేడియానికి చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఈ సభలో యువతకు వివరిస్తామని పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక గాంధీ వీలు చూసుకొని తప్పకుండా వస్తారని చెప్పారు.

ఇక నిరుద్యోగ నిరసన ర్యాలీలు, హైదరాబాద్ లో భారీ సభ తర్వాత..... రెండో విడత ‘హాత్​ సే హాత్​ జోడో యాత్ర’ను ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో పూర్తి కాగా... ఈసారి దక్షిణ తెలంగాణలోని గద్వాల నుంచి ప్రారంభించనున్నారు. ఆ దిశగా కూడా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తంగా మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న వేళ... ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో గెలిచే రేసు గుర్రాలపై కూడా ఫోకస్ పెట్టే పనిలో పడింది. ఓవైపు ప్రజల్లో ఉంటూనే... పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టిపెడుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం