Telangana Formation Day : దశాబ్దాల పోరాట ఫలితం.. పదేళ్ల 'తెలంగాణం'-telangana celebrate the 10th year of the state formation june 2 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Formation Day : దశాబ్దాల పోరాట ఫలితం.. పదేళ్ల 'తెలంగాణం'

Telangana Formation Day : దశాబ్దాల పోరాట ఫలితం.. పదేళ్ల 'తెలంగాణం'

Mahendra Maheshwaram HT Telugu
Jun 02, 2023 05:00 AM IST

Telangana Formation Day Celebrations: విద్యార్థుల పోరాటం.. అమరవీరుల త్యాగ ఫలంతో.. ఆరు దశాబ్దాల ఆకాంక్ష నిజమైంది. జూన్ 2, 2014న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఈ ఏడాది జూన్ 2కి తెలంగాణ ఆవిర్భవించి దశాబ్ధ కాలం పూర్తవుతోంది.

పదేళ్ల 'తెలంగాణం'
పదేళ్ల 'తెలంగాణం'

Telangana Formation Day 2023: నీళ్లు, నిధులు, నియమాకాలు... ఇదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్..! ఈ నినాదాలే ఉద్యమానికి ప్రాణం పోశాయి. నాటి నుంచి నేటి మలి దశ తెలంగాణ పోరాటం వరకూ ఈ నినాదమే ప్రత్యేక ఉద్యమ పోరాటానికి ఊపిరైంది. ఈ క్రమంలో ఎన్నో పార్టీలు తెరపైకి వచ్చాయి.... కానీ కాలగర్భంలో కలిసిపోయాయి. వ్యక్తులు వచ్చారు.. వ్యవస్థలో కలిసిపోయారు. కానీ కొందరు బుద్ధిజీవుల పోరాటం ఆగలేదు.. వారి గొంతులను ఆపలేదు. ఎక్కడో ఒక చోట... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని చెబుతూనే వచ్చారు. నిత్యం భావజాలవ్యాప్తికి కృషి చేశారు. విద్యార్థి లోకాన్ని తట్టిలేపారు. పోరాటం ఎగిసిపడకపోవచ్చు కానీ.. తెలంగాణ వాదాన్ని మాత్రం సజీవంగా బతికించే ప్రయత్నం చేశారు. ఓవైపు దశాబ్ధాలకు పైగా కాలం గడిచిపోయింది. అమరవీరుల స్మృతులు మాత్రమే మిగిలిపోయాయి... కానీ ఇక్కడి ప్రజల ఆకాంక్ష మాత్రం అలాగే ఉండిపోయింది. కానీ టీఆర్ఎస్ ఏర్పాటుతో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ఊవ్వెత్తున ఎగిసిపడింది. ఊరు వాడ ఒక్కటై ముందుకుసాగింది. ప్రజల ఆకాంక్షతో దిగివచ్చిన కేంద్రం.. ప్రత్యేక తెలంగాణను ప్రకటించింది. జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమానికి ప్రత్యేక ప్రస్థానం ఉంది. పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదిలివచ్చారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 300 మందికి పైగా అమరులయ్యారు. ఇదే సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. ఫలితంగా ఉద్యమం మరితం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కానీ రాజకీయ ఒత్తిళ్లు, జాతీయ పరిస్థితుల కారణంగా ఉద్యమం చల్లబడింది. పార్లమెంట్ ఎన్నికల్లో 11 ఎంపీ స్థానాలు గెలిచి ఉద్యమ ఆకాంక్షను చాటి చెప్పిన ప్రజా సమితి పార్టీ.. చివరిగా కాంగ్రెస్ లో విలీనం అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఆనాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్ధంగా నగరంలో గన్‌పార్కు వద్ద స్థూపాన్ని కట్టించారు. ఈ స్థూపమే మలి దశ పోరాటానికే స్ఫూర్తిగా నిలిచింది.

టీఆర్ఎస్ ఏర్పాటు...

పెద్ద మనుషుల ఒప్పందం, సిక్స్ పాయింట్ ఫార్ములా, విద్య, ఉద్యోగాల్లో స్థానికుల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగంలో పొందుపర్చిన 371(డి) అధికరణ, 610 జీవోలు అమలు వంటి అంశాలను అమలు చేయకుండా ఉండటం.. ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్న భావన తెలంగాణ ప్రజల్లో పెరుగుతూ వచ్చింది. ప్రజా సంఘాలు, ప్రాంతీయవాద నేతలు తమ వాణిని వినిపిస్తూనే వచ్చారు. ఇంద్రారెడ్డి రెడ్డి వంటి నేతలు పార్టీలు కూడా ఏర్పాటు చేసినప్పటికీ... సమైక్యవాదం ముందు నిలవలేకపోయారు. కానీ 2001లో టీడీపీ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధనే అజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)ని ప్రకటించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్‌కు మద్దతుగా నిలిచారు. కేవలం ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాదని భావించిన కేసీఆర్.. రాజకీయ ఎత్తుగడలతో తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ఈ క్రమంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. 2004లో పోటీ చేసి సత్తా చాటిన టీఆర్ఎస్... 2009 నాటికి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మా దాటికి కుప్పకూలిపోయింది. ఒక దశలో తెలంగాణ వాదమే లేదన్న చర్చ మొదలైంది.

కేసీఆర్ అమరణ దీక్ష…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీసు ఉద్యోగాల భర్తీ సమయంలో ఫ్రీజోన్ పై సుప్రీం తీర్పునిచ్చింది. సరిగ్గా ఈ పరిణామమే మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినట్లు అయింది. ఉద్యోగుల నిరసనలతో ఊపందుకుంది. ఇక్కడే కేసీఆర్ రీఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటు కోసం 2009 నవంబర్ 27న అమరణ దీక్షకు సిద్ధమయ్యారు. తరువాత కేసీఆర్ అరెస్ట్.. ఖమ్మం తరలింపు.. హైదరాబాద్ నిమ్స్ లో దీక్షను కంటిన్యూ చేశారు. ఓ వైపు విద్యార్థి లోకం భగ్గుమంది.. తెలంగాణవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఎల్బీ నగర్ లో శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకున్నారు. పరిస్థితులను అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం… తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9 న ప్రకటన చేసింది. తరువాత తెలంగాణ జేఏసీ ఏర్పాటు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇలా 2014 వరకు వెళ్లింది. మధ్య కాలంలో తలపెట్టిన మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె ఉద్యంలో కీలక ఘట్టాలుగా చెప్పొచ్చు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1200 మందికిపైగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు.

తెలంగాణ బిల్లుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశలో చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కానీ, వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఈ మేరకు గెజిట్ విడుదలైంది. నాటి నుంచి జూన్ 2ను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

ప్రగతిపథంలో దూసుకెళ్తున్న 'తెలంగాణ'..

తెలంగాణ ఏర్పాటు తరువాత అనేక ఇబ్బందులు ఎదుర్కొక తప్పదన్న అనుమానాలు ఉండేవి. పాలన సవ్యంగా సాగుతుందా..? శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయా..? వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించింది తెలంగాణ. కరెంట్ కోతలతో తల్లడిల్లిన తెలంగాణ.. ఇవాళ 24 గంటల పాటు నిరంతర విద్యుత్ ను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వేసవిలోనూ కరెంట్ కట్ అన్న పదానికి చోటు ఇవ్వకుండా ముందుకు సాగుతోంది. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమే అని చెప్పొచ్చు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. పారిశ్రామిక, ఐటీ రంగంలో తిరుగులేని విధంగా ముందుకు సాగుతోంది. లక్షల కోట్ల రూపాయలతో కూడిన పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ఇదంతా సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు, పెట్టుబడిదారులకు మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణంగా చెప్పొచ్చు. జిల్లాల్లో కూడా ఐటీ ఐబ్ లు ఏర్పాటవుతున్నాయి. రైతుబందు, రైతుబీమా వంటి పథకాలు వ్యవసాయ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తద్వారా రైతులకు భరోసా కలిపించే ప్రయత్నం జరిగింది. పెట్టుబడి సాయంతో ఏకరానికి రూ. 5వేల రూపాయలు అందిస్తున్నారు.

ఒడిసిపట్టే ప్రయత్నం...

ఏ నీళ్ల కోసమేతే పోరాడిందో తెలంగాణ... ఇవాళ స్వరాష్ట్రంలో భారీ ప్రాజెక్టులకు వేదికైంది. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే ప్రయత్నం జరుగుతోంది. కృష్ణా, గోదావరి జలాల్లో కేటాయించిన వాటాను పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోనే స్థితిలో తెలంగాణ లేదు. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణ దశ దిశ మార్చేలా కాళేశ్వరం వంటి ప్రాజెక్టును చేపట్టారు. తద్వారా వ్యవసాయ రంగానికి సాగు నీరు అందించే ప్రయత్నం జరుగుతుంది. నల్గొండ జిల్లా వంటి పరిధిలో కూడా కొత్త ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఒక దశలో దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు... సువర్ణ అధ్యాయంగా చెప్పొచ్చు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం జరిగింది. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ.. 33 జిల్లాకు చేరింది. మండలాల సంఖ్యతో పాటు రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెరిగింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసిన భూములకు భారీ ధర పలికే పరిస్థితులు వచ్చాయి.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలతో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ పల్లె ప్రకృతి వనాలతో పాటు వైకుంఠదామాలు, మిషన్ భగీరథ నీళ్లు, మిషన్ కాకతీయ వంటి పథకాల ఫలితాలు అందుతున్నాయి. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులను భారీగా చేపట్టారు. వైద్యాశాఖలో సమూల మార్పులు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా వైద్య కళాశాలల ఏర్పాటు అవుతున్నాయి. గురుకులాల వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ప్రతి సామాజికవర్గానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరే దిశగా పథకాలు వస్తున్నాయి. యాదాద్రి నిర్మాణం తెలంగాణకు తలమానికంగా మారింది. త్వరలోనే కొండగట్టు పనులు కూడా షురూ కానున్నాయి. హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా ఎదిగింది. రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నగరవ్యాప్తంగా ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. మెట్రో విస్తరణ పెరిగింది. పెట్టుబడులకు కేరాఫ్ గా తెలంగాణ నిలుస్తోంది. అంకుర సంస్థలకు ఊతం ఇచ్చేలా ఏర్పాటు చేసిన టీ-హబ్... అత్యాధునికంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం, దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వంటివి ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరింది తెలంగాణ రాష్ట్రం. మొత్తంగా ఈ దశాబ్ధ కాలంలో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం వంటి రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి, పురోగతి సాధించే దిశగా అడుగులు వేస్తోంది ‘తెలంగాణ’….!

తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పదేళ్ల ప్రస్థానం కొనసాగుతుందే చెప్పొచ్చు. అన్ని రంగాల్లోనూ అమలు చేసిన వ్యూహాత్మక ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది తెలంగాణ సర్కార్. తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం