KCR Review: చరిత్రలో నిలిచిపోయేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్న కేసీఆర్-kcr ordered to organize decade celebrations for three weeks to go down in history
Telugu News  /  Telangana  /  Kcr Ordered To Organize Decade Celebrations For Three Weeks To Go Down In History
దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సిఎం కేసీఆర్ సమీక్ష
దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సిఎం కేసీఆర్ సమీక్ష

KCR Review: చరిత్రలో నిలిచిపోయేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్న కేసీఆర్

25 May 2023, 19:32 ISTHT Telugu Desk
25 May 2023, 19:32 IST

KCR Review: దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

KCR Review: ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా పదేళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

గురువారం డా.బిర్.అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది.

మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సిఎంఒ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, డిజీపి, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు వారి కార్యక్రమాల గురించి, ఏరోజుకు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం సూచించారు.గ్రామాలు, నియోజకవర్గ, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సిఎం వివరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం దిశా నిర్దేశం చేశారు.

రూ.105కోట్ల నిధుల విడుదల….

దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఖర్చులకు గాను కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారు.దేశానికే ఆదర్శంగా తెలంగాణ హరితహారం సాధించిన విజయాలను సిఎం కేసీఆర్ వివరించారు. వాతావరణ పరిస్థితలకు అనుగుణంగా వరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలగురించి సిఎం వివరించారు. అదే సందర్భంలో...గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ గురించి సిఎం ప్రకటించారు.

దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఏర్పడే నాటికి వున్న పరిస్థితులను పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని సిఎం కేసీఆర్ రంగాల వారిగా వివరించారు. ఏ రోజు కారోజుగా రోజువారీ కార్యక్రమాలను వివరించిన ముఖ్యమంత్రి ఆయా రోజు చేపట్టే శాఖలు అవి సాధించిన అభివృద్ధిని వివరిస్తూ...అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ప్రజాసంక్షేమ కోణం వెనకున్న దార్శనికతను కలెక్టర్లకు సిఎం వివరించారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు….

గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సిఎం వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని కేసీఆర్ వివరించారు.

గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి సిఎం కేసీఆర్ సమావేశంలో అంశాల వారీగా లోతుగా విశదీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సిఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

‘‘ కొన్ని దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అందరం కలిసి సమిష్టి కృషితో అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో సమ్మిళితాభివృద్ధిని సాధించుకున్నామన్నారు.

తెలంగాణ వ్యవసాయం ఐటి పరిశ్రమలు విద్యుత్ సహా అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉందని, నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ నాటికి మనకన్నా ముందంజలో వున్న గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు పంజాబ్ హర్యానాలను దాటేసి తెలంగాణ ముందంజలోకి దూసుకుపోతుందన్నారు. రాష్ట్రం వచ్చినపుడు కేవలం 8 లక్షల టన్నులు గా వున్న ఎరువుల వినియోగం నేడు 28 లక్షల టన్నులు వాడుతున్నామన్నారు.

పద్ధతి ప్రకారం ఎటువంటి ఇబ్భంది రాకుండా ఎరువలను ఇతర వ్యవసాయ అవసరాలను రైతులకు అందుబాటులోకి తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన దార్శినిక విధానాలతోనే సాధ్యమైందన్నారు. గంజికేంద్రాలు నడిచిన పాలమూరు లో నేడు పచ్చని పంటలతో పారే వాగులతో పాలుగారే పరిస్ఠితి నెలకొన్నదని ధాన్యం ఉత్పత్తిలో మనం పంజాబ్ ను దాటేసి పోతున్నామని సిఎం వివరించారు.

21 రోజుల పాటు జరిగే దశాబ్ధి ఉత్సవాలను జిల్లాల వారీగా వీడియో రికార్డు చేసి భధ్రపరచాలని సిఎం కలెక్టర్లను ఆదేశించారు. అదే సందర్భంలో నియోజక వర్గాల వారీ జిల్లాల వారీగా జరిగిన అభివృద్ధిని తెలిపే .. పదేండ్ల ప్రగతి నివేదిక.. పుస్తకాలను ముద్రించి అందచేయాలన్నారు. ఇప్పటికే నిర్ణయించిన మేరకు ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధిని డాక్యుమెంటరీలు రూపొందుతున్నాయని వాటిని ఈ ఉత్సవాల సంధర్భంగా ప్రదర్శించాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.

జూన్ 24 నుంచి 30 తారీఖు వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ :

రాష్ట్రవ్యాప్తంగా...2845 గ్రామాలు తాండాలు గూడాల పరిథిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వున్న4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని సిఎం కేసీఆర్ ప్రకటించారు. వీరితో పాటు 3 లక్షల 8 వేల మంది ఆరో వో ఎఫ్ ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధును వర్తింపచేస్తామని సిఎం అన్నారు.