Professor Jayashankar: తెలంగాణ ఏర్పాటే శ్వాసగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్
Professor Jayashankar: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై దశాబ్ది వేడుకల్ని జరుపుకుంటున్న వేళ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంగా ఉద్యమకారుల్ని ఏకం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Professor Jayashankar: తెలంగాణ జాతి పితగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే బతుకంతా గడిపిన ప్రొఫెసర్ జయశంకర్‌ను దశాబ్ది వేడుకల సందర్భంగా స్మరించుకోవాల్సి ఉంది. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట్ గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మీ దంపతులకు 1934 ఆగష్ట్ 6వ తేదీన జయశంకర్ జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అసమానతలపై జయశంకర్ విద్యార్ధి దశ నుంచి పోరాటంచేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలో నుంచి సమరశీల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఎవరు మాట్లాడటానికి సాహసించని సమయంలో 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించిన ధీశాలి ప్రొఫెసర్ జయశంకర్.
మొదటి ఎస్సార్సీ కమిషన్ ఎదుట హాజరై విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తన వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ విశ్లేషించారు. ఉర్దూ మీడియం పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ హన్మకొండ వెళ్లి లష్కర్ వీధిలోని మర్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు.
హన్మకొండ న్యూ హైస్కూల్‌లో మాధ్యమిక విద్య, హన్మకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్య పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో బిఏ పూర్తి చేశారు. ఆర్ట్స్‌తో పాటు సైన్స్, సైన్స్‌తో పాటు ఆర్ట్స్ కోర్సులు తప్పనిసరిగా చదవాలన్న నిబంధనలకు అనుగుణంగా అన్ని సబ్జెక్టుల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు.అర్థశాస్త్రంపై అభిమానంతో బెనారస్ హిందూవర్శిటీ,అలీగఢ్ యూనివర్శిటీల నుంచి ఎకనామిక్స్‌లో పీజీ పూర్తి చేశారు.హన్మకొండలో బీఈడీ పూర్తి చేసి 1960లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. అధ్యాపకుడిగా ఎంతో మందికి విద్యబోధన చేశారు.
1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో భాగంగా విశాలాంధ్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో జయశంకర్ ఉద్యమ జీవితం మొదలైంది. 1968-69లో జరిగిన జై తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఉపాధ్యాయుడిగా ఉంటూనే కీలక పాత్రపోషించారు. ఐదుదశాబ్దాల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో పదవులు, ప్రలోభాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం విడిచిపెట్టకుండా చివరి వరకు పోరాడారు.
1996 మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల ఐక్య వేదిక ఏర్పాటులో జయశంకర్ కీలక పాత్ర పోషించారు. 2001లో టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించిన సమయంలో ఆ పార్టీకి ముఖ్య సిద్ధాంతకర్తగా వ్యవహరించారు. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉద్యమ పార్టీగా టిఆర్‌ఎస్‌ను మలచడంలో, ఉద్యమ స్వరూపాన్ని రూపొందించడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూనే పలు పదవుల్ని అలంకరించారు. 1975-79 మధ్య వరంగల్ సీకేఎం కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేశారు. 1979-81వరకు కాకతీయ వర్శిటీ రిజిస్ట్రార్‌గా, 1982-91వరకు హైదరాబాద్ సీఫెల్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. 1991-94వరకు కాకతీయ వర్శిటీ వీసీగా పనిచేశారు. 2004-06మధ్య కాలంలో ప్రభుత్వ జాతీయ కమిషన్ ఆర్గనైజింగ్ సెక్టార్ సభ్యుడిగా,కేరళాలోని మహాత్మగాంధీ వర్శిటీ ప్లానింగ్ బోర్డు సభ్యుడిగా, సీఫెల్, ఆర్‌ఈసీలలో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సభ్యుడిగా పనిచేశారు.
తెలంగాణ సాధనలో రాజకీయ అంటరానితనాలు ఉండకూడదని, అందరితో కలిసి పనిచేస్తానని ప్రకటించిన తెలంగాణ మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్ అని, ఉద్యమంలో అనేక ప్రవాహాలు ఉంటాయని అవకాశం ఉంటే కలిసి పనిచేయాలని, కుదరకుంటే సమన్వయంతో లేకుంటే సహకారంతో అదీ కుదరకపోతే సమాంతరంగా ఒకరికొకరు నిందించుకోకుండా పనిచేయాలని దిశానిర్దేశం చేయడం ద్వారా తెలంగాణ స్వప్నాన్ని సాధించడం ద్వారా తెలంగాణ జాతిపిత అయ్యారు ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూడక ముందే 2011 జూన్ 21న క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ కన్నుమూశారు.