Telangana Formation : కేసీఆర్ దీక్ష నుంచి కేంద్రం గెజిట్ వరకు... కీలక ఘట్టాలు ఇవే-key events in the history of telangana movement 2009 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Key Events In The History Of Telangana Movement 2009

Telangana Formation : కేసీఆర్ దీక్ష నుంచి కేంద్రం గెజిట్ వరకు... కీలక ఘట్టాలు ఇవే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 01, 2023 01:56 PM IST

Telangana Formation Day 2023: ప్రత్యేక తెలంగాణ కోసం సకల జనులు ఉద్యమంలో భాగమయ్యారు. 2009లో కేసీఆర్ అమరణదీక్ష ప్రకటన నాటి నుంచి కేంద్రం గెజిట్ ఇచ్చే వరకు ఎన్నో కీలక మలుపులు తిరుగింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం... హైదరాబాద్ తో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.

కేసీఆర్ దీక్ష నుంచి కేంద్రం గెజిట్ వరకు... మలిదశ ఉద్యమంలోని ఘట్టాలు ఇవే
కేసీఆర్ దీక్ష నుంచి కేంద్రం గెజిట్ వరకు... మలిదశ ఉద్యమంలోని ఘట్టాలు ఇవే

Telangana Formation Day June 2: 'ప్రత్యేక తెలంగాణ'... ఈ ఒక్క ఆకాంక్షే ఎంతో మందిని కదిలించింది. ఉద్యమానికి ఊపిరి పోసింది.. నవ తరాన్ని తట్టిలేపింది. భావజాలవ్యాప్తి దశ నుంచి...బలమైన దశకు చేరేలా బాటలు వేసింది. విద్యార్థుల పోరాటం.. అమరవీరుల త్యాగ ఫలంతో.. ఆరు దశాబ్దాల ఆకాంక్ష నిజమైంది. జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. ఈ జూన్ 2తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి కూడా అడుగుపెట్టబోతుంది.

ట్రెండింగ్ వార్తలు

1969 ఉద్యమం విఫలమైనప్పటికీ... కేసీఆర్ దీక్షలో 2009లో మళ్లీ ప్రారంభమైన మలి దశ తెలంగాణ పోరాటం మాత్రం ఆగలేదు. గమ్యం చేరుకునే వరకు... ఇక్కడి ప్రజలు వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలో ఒక్కో కీలక ఘట్టంలో భాగస్వామ్యులయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం రాజీలేని పోరాటం చేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే 2009 నుంచి 2014 వరకు జరిగిన కొన్ని ముఖ్య సందర్భాలు తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నేటి తరమే కాదు... భవిష్యత్ తరాల్లో స్ఫూర్తి నింపే ఘట్టాలుగా ఉంటాయని చెప్పటంలో ఎలాంటి సందేహాం లేదు. అలాంటి ఘట్టాల్లో కొన్నింటిని చూస్తే....

కీలక పరిణామాలు - ఘట్టాలు

- 2009 ఎన్నికల తర్వాత ఫ్రీజోన్ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. పోలీసు ఉద్యోగాలకు హైదరాబాద్ లో లోకల్ రిజర్వేషన్లు ఎత్తివేసూ ఫ్రీజోన్ గా ప్రకటించింది. ఇదీ కాస్త తెలంగాణ ఉద్యమానికి మరింత ఆజ్యం పోసినట్లు అయింది. రాజకీయ పార్టీలతో పాటు యువత, ఉద్యోగులు, ప్రజాసంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఫ్రీజోన్ కు వ్యతిరేకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యోగులు భారీ సభను కూడా తలపెట్టారు.

-సుప్రీంకోర్టు తీర్పు 610 జీవోకు విరుద్ధమని నాడు టీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్... రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరిగింది. పలుచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు దీక్షకు దిగారు. వారికి సంఘీభావం తెలిపేందుకు కేసీఆర్ అక్కడికి వెళ్లారు. ఇక్కడ కీలక ప్రకటన చేశారు.

- 2009 నవంబర్ 29న దీక్షకు దిగనున్నట్లు గూలాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అన్న నినాదం కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా సిద్ధిపేటలోని రంగధాంపల్లిని దీక్షాస్థలిగా నిర్ణయించారు. ఇందుకోసం టీఆర్ఎస్ పార్టీ భారీగా ఏర్పాట్లును కూడా చేసింది.

-2009 నవంబర్ 26న కేసీఆర్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరారు. మార్గమధ్యంలో దీక్షాస్థలికి వెళతారన్న ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్‌ను అక్కడే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కేసీఆర్ నేరుగా కరీంనగర్ వెళ్లారు. ఉత్తర తెలంగాణ భవనంలోనే 3 రోజులపాటు గడిపారు. 2009 నవంబర్ 29న పోలీసు బలగాలు భారీ సంఖ్యలో తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టాయి. వేలాదిమంది ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరారు. ఈ సందర్భంగా పోలీసులు, తెలంగాణ వాదుల మధ్య తోపులాట జరిగింది. కేసీఆర్ దీక్షాస్థలానికి బయల్దేరారు. పోలీసులు వ్యూహాత్మకంగా ప్రజలు, నేతల కళ్లుగప్పి కేసీఆర్ కాన్వాయ్‌ని ఖమ్మం వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ దీనికి అడ్డు చెప్పి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కేసీఆర్‌ను తమ వాహనంలో ఖమ్మం తీసుకెళ్లారు. కేసీఆర్‌ను ఖమ్మం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచగా... ఆయనకు 14 రోజుల రిమాండు విధించారు. దీంతో కేసీఆర్‌ను జైలుకు తరలించారు.

- జైలులోనూ కేసీఆర్ దీక్షకు దిగారు. కేసీఆర్ అరెస్టు వార్తతో తెలంగాణలో బంద్‌లు, నిరసనలు, రాస్తారోకోలు జరిగాయి. ఉస్మానియా వర్శిటీ రణరంగమైంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా విద్యార్థి లోకం భగ్గుమంది. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. 29 నవంబర్ న ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ప్రాణాలతో పోరాడి డిసెంబర్ 3న శ్రీకాంతాచారి మృతి చెందడంతో ఉద్యమం మరో టర్న్ తీసుకున్నట్లు అయింది.

- ఇక రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం... కేసీఆర్ కు ఏదైనా జరిగితే రాష్ట్రంలో చోటు చేసుకునే పరిణామాలపై ఓ అంచనాకు వచ్చింది. పరిస్థితి మరింత దిగజారకుండా... 2009 డిసెంబర్ 9 రాత్రి పదకొండున్నరకు కేంద్రమంత్రి చిదంబరం ఓ ప్రకటన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పుడే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ వెంటనే ఆమరణనిరహార దీక్ష విరమించాలని కోరారు. పలువురు ప్రజాసంఘాల నేతలు కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

- తెలంగాణపై కేంద్రం ప్రకటన ఇవ్వటాన్ని సీమాంధ్రాలు తీవ్రంగా ఖండించారు. అక్కడి నేతలు అంతా సమైక్యరాగాన్ని వినిపించారు. సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టారు. అంతేకాదు ఏకంగా అందరూ ప్రజాప్రతినిధులు రాజీనామాలు కూడా చేసి ఉద్యమంలోకి వచ్చారు. దీంతో తెలంగాణ ప్రక్రియకు మళ్లీ బ్రేకులు పడినట్లు అయింది. ఫలితంగా డిసెంబర్ 23న చిదంబరం మరో ప్రకటన చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరమా అనే కోణంలో రాజకీయ పార్టీలు, ఇతర మేధావుల సూచనలు అన్ని పరిగణలోనికి తీసుకున్న తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

- చిదంబరం రెండో ప్రకటనపై తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే దీక్ష విరమించిన కేసీఆర్... జానారెడ్డి ఇంటికి వెళ్లి కీలక చర్చలు జరిపారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులంతా 48 గంటల్లోగా రాజీనామా చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా పొలిటకల్ జేఏసీకి శ్రీకారం చుట్టారు. ఇందుకు ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వం వహించారు. ఆయన ఆధ్వర్యంలోనే అన్ని రాజకీయ, ప్రజాసంఘాలు పని చేశాయి. జేఏసీ ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాల్లో కూడా జేఏసీలు ఫామ్ అయ్యాయి.

- 2010 ఫిబ్రవరి 3న తెలంగాణ ఏర్పాటు సాధ్యసాధ్యాలపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. 5 మందితో కూడిన రిటైర్డ్ జడ్జ్ జస్టిన్ శ్రీకృష్ణ కమిటీ... 9 నెలల పాటు ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగింది. ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసి... చాలా మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. అదే ఏడాది డిసెంబర్ 30 రిపోర్టు కేంద్రానికి అందజేసింది. ఈ కమిటీ 6 సూచనలు చేసింది. ఇందులో ఐదు అంశాలు తెలంగాణకు వ్యతిరేకం కాగా.. ఒక అంశం మాత్రం హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇవ్వాలని సూచించింది. ఈ కమిటీ రిపోర్టును కూడా తెలంగాణ వాదులు తీవ్రంగా ఖండించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందంటూ అప్పట్లో కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

- రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం జాప్యాన్ని ఖండిస్తూ జేఏసీ కార్యక్రమాలను పెంచింది. 2011లో మార్చి 10 ట్యాంక్ బండ్ పై లక్షలాది మందితో మిలియన్ మార్చ్ నిర్వహించింది. ఇందులో టీఆర్ఎస్, సీపీఐ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సాయంత్రం వరకు ప్రశాంతంగా సాగినప్పటికీ... ఆ తర్వాత ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలు ధ్వంసం చేశారు ఉద్యమకారులు. కొన్ని మీడియా వాహనాలపై కూడా దాడులు జరిగాయి. తెలంగాణ ఉద్యమంలోనే మిలియన్ మార్చ్ చారిత్రక ఘట్టమని చెప్పొచ్చు. 2011 సెప్టెంబర్13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు సకలజనుల సమ్మె నిర్వహించారు. ఇందులో బడి గంట నుంచి గుడి గంట వరకు అన్ని బంద్ అయ్యాయి.

-ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చ జరిగింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ప్రకటించింది. 2013 డిసెంబర్ 5న తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు డిసెంబర్ 12న రాష్ర్ట అసెంబ్లీకి చేరింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలు బిల్లు ప్రతుల్ని చింపివేశారు. ఈ బిల్లను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఏపీ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపింది.

- 2014 ఫిబ్రవరి 7న తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభ బిల్లును ఆమోదించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టగా, అదే రోజున ఆమోదం పొందింది. అయితే లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీమా

-2014 మార్చి 1వ తేదీన రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ర్టపతి సంతకం చేశారు. మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. 2014, మార్చి 4న 2014 జూన్ 2ను అపాయింటెడ్ డేగా ప్రకటించింది. దేశంలో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది.

- తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవటంతో కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు. నవ్యాంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలిచారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం