Ts Formation Day: తెలంగాణలో మూడు వారాల పాటు రాష్ట్రావతరణ వేడుకలు.. కేసీఆర్ దిశానిర్దేశం-the state government has made arrangements to organize statehood celebrations grandly in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  The State Government Has Made Arrangements To Organize Statehood Celebrations Grandly In Telangana

Ts Formation Day: తెలంగాణలో మూడు వారాల పాటు రాష్ట్రావతరణ వేడుకలు.. కేసీఆర్ దిశానిర్దేశం

HT Telugu Desk HT Telugu
May 26, 2023 08:12 AM IST

Ts Formation Day: తెలంగాణ ఆవిర్బవించి పదేళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమైంది. జూన్ రెండు నుంచి 22వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

దశాబ్ది వేడుకల నిర్వహణపై కలెక్టర్లతో సిఎం కేసీఆర్
దశాబ్ది వేడుకల నిర్వహణపై కలెక్టర్లతో సిఎం కేసీఆర్

Ts Formation Day: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ అంశాలవారీగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ వేడుకల్ని విజయవంతం చేయాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

శాఖల వారీగా పదేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన సంక్షేమ కోణాన్ని, తాత్విక ధోరణిని, దాని వెనుకున్న దార్శనికతను వివరించారు. జూన్‌ 2 నుంచి 22 వరకు మూడు వారాలపాటు సాగే ‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’ రోజువారీ కార్యక్రమాల పూర్తి వివరాలను సీఎం కేసీఆర్‌ వివరించారు.

జూన్‌ 2: ఉత్సవాల ప్రారంభోత్సవం

హైదరాబాద్‌లోని గన్‌పార్‌లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులర్పిస్తారు. సచివాలయ ప్రాంగణంలో పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం దశాబ్ది ఉత్సవ సందేశం ఇస్తారు. జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధుల ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేస్తారు. దశాబ్ది ఉత్సవ సందేశాన్ని ఇస్తారు.

జూన్‌ 3: తెలంగాణ రైతు దినోత్సవం

రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, పథకాల విశిష్టతను తెలియజేసేలా ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేస్తారు. రైతుబంధు సమితి నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, హార్టికల్చర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు. వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరిస్తారు. అనంతరం రైతులందరితో సహపంక్తి భోజనం ఉంటుంది. వ్యవసాయ కళాశాలల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జూన్‌ 4: సురక్షా దినోత్సవం

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని, విజయాలను, మహిళల భద్రతకు తీసుకొంటున్న చర్యలను వివరించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌పై పెట్రోలింగ్‌ కార్లు, బ్లూ కోల్ట్స్‌తో ర్యాలీ నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అంబేదర్‌ విగ్రహం ముందు పోలీస్‌ బ్యాండ్లతో ప్రదర్శన. ‘మీ రక్షకుల గురించి తెలుసుకోండి’ థీమ్‌తో ఎగ్జిబిషన్‌, పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోలీస్‌ జాగృతి కళాకారుల బృందాలు, పోలీస్‌ జాగిలాల ప్రదర్శనలు ఉంటాయి. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ విశిష్టత, సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘాలో నంబర్‌ 1గా తెలంగాణ తదితర విషయాలను షో కేస్‌ చేస్తారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీతో పాటు సభ ఏర్పాటు చేస్తారు.

జూన్‌ 5: విద్యుత్ విజయోత్సవం..

నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్తు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసి విద్యుత్తు రంగంలో సాధించిన మార్పును వివరిస్తారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి సమావేశం. రాష్ట్రం 9 ఏండ్లలో సాధించిన విజయాలపై డాక్యుమెంటరీ ప్రదర్శన, పుస్తకావిషరణ, ప్రసంగాలు ఉంటాయి. విద్యుత్తు శాఖ మంత్రి, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ఇతర అధికారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు.

జూన్‌ 6: పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని, టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమల స్థాపన, రాష్ట్రానికి తరలి వచ్చిన పెట్టుబడుల వివరాలు, తద్వారా పెరిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను వివరిస్తారు. టీ హబ్‌, వీ హబ్‌లలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సమావేశం నిర్వహిస్తారు.

జూన్‌ 7: సాగునీటి దినోత్సవం

కాళేశ్వరం ప్రాజెక్టుపై డాక్యుమెంటరీని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు. సాగునీటి రంగం ప్రగతిని వివరిస్తూ నియోజకవర్గంలో వెయ్యి మందితో సభ నిర్వహిస్తారు. రవీంద్ర భారతిలో ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలు వివరిస్తారు.

జూన్‌ 8: ఊరూరా చెరువుల పండుగ

గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహిస్తారు. గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్య కారుల వలలతో ఊరేగింపుగా చేరుకుంటారు. కట్ట మైసమ్మ పూజ, చెరువు నీటికి పూజ చేస్తారు. సాంసృతిక కార్యక్రమాలు, సహపంక్తి భోజనం ఉంటుంది.

జూన్‌ 9: తెలంగాణ సంక్షేమ సంబరాలు

నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులతో వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహిస్తారు. తెలంగాణ సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో సభ నిర్వహిస్తారు. గణాంకాలను వివరిస్తారు. గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీని ప్రారంభిస్తారు. గతంలో భూములు సేకరించిన చోట, అందుబాటులో ఉన్నచోట అర్హులైన పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు.

జూన్‌ 10: సుపరిపాలన దినోత్సవం

అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంసరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రస్తావించాలి. నూతనంగా ఏర్పడిన మండలాలు, మున్సిపాలిటీల్లో సంబురాలు జరిగేలా స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొంటారు.

జూన్‌ 11: సాహిత్య దినోత్సవం

రాష్ట్ర, జిల్లా స్థాయిలో కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. రవీంద్రభారతిలో ఉర్దూ, తెలుగు కవులచే రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన 5 పద్య కవితలను, 5 వచన కవితలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందిస్తారు.

జూన్‌ 12: తెలంగాణ రన్‌

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్‌ నిర్వహిస్తారు. పోలీస్‌, క్రీడలు, యువజన సర్వీసులశాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి.

జూన్‌ 13: మహిళా సంక్షేమ దినోత్సవం

నియోజకవర్గం కేంద్రంలోమహిళా సదస్సు నిర్వహిస్తారు. మహిళా సంక్షేమం కోసం పెన్షన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్‌, మారెట్‌ కమిటీల్లో రిజర్వేషన్‌, మహిళలకు వీఎల్‌ఆర్‌, షీ టీమ్స్‌, వీ హబ్‌ ఏర్పాటు, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పెంపు, వేతనాల పెంపు, మహిళా డిగ్రీ కాలేజీల పెంపు వంటి కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం ఉంటుంది.

జూన్‌ 14: వైద్యారోగ్య దినోత్సవం

హైదరాబాద్‌లోని నిమ్స్‌లో నూతనంగా నిర్మిస్తున్న 2 వేల పడకల దవాఖానాకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు. నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, నూతన మెడికల్‌, నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీల విద్యార్థులతో సభ ఏర్పాటు చేస్తారు. ఉత్తమ సిబ్బందికి సన్మానం ఉంటుంది.

జూన్‌15: పల్లె ప్రగతి దినోత్సవం

పంచాయతీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగురవేస్తారు. పల్లె ప్రగతి ద్వారా, గ్రామానికి వచ్చిన నిధుల వివరాలు, సంక్షేమ పథకాలతో ప్రజలకు జరిగిన లబ్ధి, మౌలిక వసతుల వివరాలను ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయిలో రవీంద్రభారతిలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో పల్లెప్రగతిపై సమావేశం జరుగుతుంది. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.

జూన్‌ 16: పట్టణ ప్రగతి దినోత్సవం

ప్రతి కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేయాలి. పట్టణ ప్రగతి ద్వారా, పట్టణానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్ధిని, పట్టణంలో మౌలిక వసతుల వివరాలు, జీవో 58, 59 వల్ల కలిగిన లబ్ధి వంటివి వివరిస్తారు.

జూన్‌ 17: తెలంగాణ గిరిజనోత్సవం

గిరిజన గ్రామాల్లో సభలు ఏర్పాటుచేసి గిరిజన సంక్షేమాన్ని వివరిస్తారు. రాష్ట్రస్థాయిలో నగరంలోని రవీంద్ర భారతిలో గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేస్తారు.

జూన్‌ 18: మంచి నీళ్ల పండుగ

ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పాత్రికేయులు, వివిధ వర్గాల ప్రజలతో మిషన్‌ భగీరథ ప్లాంట్ల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తారు. మహిళలతో సభ నిర్వహించి గతంలో మంచినీటి కోసం పడ్డ కష్టాలను, మిషన్‌ భగీరథతో లబ్ధిని వివరిస్తారు. రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారతిలో సభ నిర్వహిస్తారు.

జూన్‌ 19: తెలంగాణ హరితోత్సవం

అన్ని గ్రామాలు, పట్టణాల్లో మొకలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. హరిత హారంతో కలిగిన ప్రయోజనాలు, అటవీ శాఖ విజయాలు, అవార్డులను వివరిస్తారు.

జూన్‌ 20: విద్యా దినోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో పతాక ఆవిష్కరణ ఉంటుంది. తదనంతరం నిర్వహించే సభలో విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. మన ఊరు-మన బడి పాఠశాలలను ప్రారంభిస్తారు. 10 వేల గ్రంథాలయాలను, 1600 డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను ప్రారంభిస్తారు. పిల్లలకు పోటీలు నిర్వహిస్తారు.

జూన్‌ 21: తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్ధనా మందిరాలను అలంకరిస్తారు. దేవాలయాల్లో వేద పారాయణం, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి.

జూన్‌ 22: అమరుల సంస్మరణ

గ్రామ పంచాయతీలు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతాయి. అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తాయి. అమరుల సంస్మరణ తీర్మానం చేస్తాయి. మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్తులలో, విద్యాలయాలలో ప్రార్థనా సమావేశాల్లో శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌ బండ్‌ నుంచి 6 వేల మందికి తగ్గకుండా కళాకారులతో భారీ ర్యాలీ ఉంటంది. అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు.

IPL_Entry_Point