Teenmar Mallanna : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న విజయం..!
Telangana Graduate MLC Election Result 2024 : నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిపై గెలిచారు.
Telangana Graduate MLC Election Result 2024: నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న… బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిపై గెలిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత… అధికారులు విజయాన్ని ధ్రువీకరించారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన సంగతి తెలిసిందే.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజార్టీ రాకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరగా BRS అభ్యర్థి ఎలిమినేషన్‌తో మల్లన్న విజయం సొంతం చేసుకున్నారు.
తీన్మార్ మల్లన్న గతంలో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గతంలో మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మొత్తంగా 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్న…ఈసారి విక్టరీని సొంతం చేసుకున్నారు.
నైతిక విజయం నాదే - బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి
ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి మాట్లాడారు. సాంకేతికంగా ఎమ్మెల్సీగా ఓడిపోయినా నైతికంగా విజయం తనదే అని చెప్పారు. రాష్ట్రంలో మూడు జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది అయినా సరే గట్టి పోటీ ఇచ్చామని చెప్పారు.
“శాసనమండలిలో అడుగు పెట్టలేకపోతున్నా.. జన సభలో ప్రజల తరుపున ప్రభుత్వంతో పోరాటం చేస్తా. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు నేను గెలవాలని కోరుకున్నారు. జేడీ లక్ష్మి నారాయణ లాంటి వారు నాకు మద్దతు తెలిపారు. పన్నెండు ఏళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నాను. బిఆరెస్ పార్టీ నాయకులందరు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. బిఆర్ఎస్ శ్రేణులు పోరాట పటిమ చూపించారు. మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లలో నాకు లక్షా ముప్పై ఐదు వేల ఓట్లు వేశారు. ఊపిరి ఉన్నంతవరకు పట్టభద్రుల కొరకు ప్రజా క్షేత్రంలో పోరాడుతా” అని రాకేశ్ రెడ్డి చెప్పారు.
ఈ స్థానానికి మే 27వ తేదీన పోలింగ్ జరిగింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34 అసెంబ్లీ స్థానాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలవగా… స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ కుమార్ నాల్గో స్థానంలో నిలిచారు.