Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!
Mallareddy Land Issue : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో భూవివాదంలో చిక్కుకున్నారు. సుచిత్ర సర్వే నెంబర్ 82లోని భూమి తనదంటూ తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అనుచరులతో మల్లారెడ్డి హల్ చల్ చేశారు.
Mallareddy Land Issue : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఇతరులకు మధ్య భూవివాదం నెలకొంది. తన స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లోని భూమిపై మల్లారెడ్డికి, ఇతరులకి మధ్య భూవివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారని మల్లారెడ్డి, తన అనుచరులతో కలిసి వచ్చి హల్ చల్ చేశారు. భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్ తొలగించారు. ఘర్షణ వాతావరణ తలెత్తడంతో పోలీసులు కల్పించుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. అయితే తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే ఎలా ఊరుకున్నారని పోలీసులతో మల్లారెడ్డి తీవ్ర వాగ్వాదం చేశారు. తనపై కేసు పెడితే పెట్టుకోండని, అంతే కానీ తన స్థలాన్ని వదలనన్నారు. మల్లారెడ్డి అనుచరులు పోలీసుల ముందే ఫెన్సింగ్‌ను కూల్చేశారు.
మల్లారెడ్డి వర్సెస్ 15 మంది
అయితే ఈ భూమి తమదేనని 15 మంది కోర్టుకు వెళ్లారు. కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 400 గజాల చొప్పున 1.11 ఎకరాలను మొత్తం 15 మంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ స్థలం తనదంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారని 15 మంది అంటున్నారు. స్థలంపై కోర్టులో వివాదం నడుస్తుండడంతో సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరువర్గాలకు సూచించారు. మల్లారెడ్డి అనుచరులు తమను భయపెట్టి భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆ 15 మంది వ్యక్తులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల అదుపులో మల్లారెడ్డి
తన స్థలాన్ని కాపాడుకుంటానని మల్లారెడ్డి తన అనుచరులతో ఫెన్సింగ్ తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తన అనుచరులను అడ్డుకున్న పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న బీఆర్ఎన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
భూకబ్జా ఆరోపణలు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై గతంలో కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని మల్లారెడ్డిపై అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గత ఏడాది శామీర్ పేట పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై 420 సెక్షన్ తో పాటు పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్‌పేట పోలీస్ స్టేషన్ లో కేతావత్ భిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మల్లారెడ్డితో పాటు పలువురి పేర్లను కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు భూకబ్జా కేసు నమోదు చేశారు పోలీసులు.
సంబంధిత కథనం