Siddipet Crime : మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ, యువకుడి హత్య- నిందితులను పట్టించిన సెల్ ఫోన్-siddipet crime news in telugu quarrel between drunk persons youth murdered ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Crime : మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ, యువకుడి హత్య- నిందితులను పట్టించిన సెల్ ఫోన్

Siddipet Crime : మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ, యువకుడి హత్య- నిందితులను పట్టించిన సెల్ ఫోన్

HT Telugu Desk HT Telugu
Jan 22, 2024 09:06 PM IST

Siddipet Crime : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ లో డబ్బులు కోసం గొడవ పడి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. అయితే సెల్ ఫోన్ నిందితులను పట్టించింది.

సిద్ధిపేట జిల్లాలో యువకుడి హత్య
సిద్ధిపేట జిల్లాలో యువకుడి హత్య

Siddipet Crime : మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ పడి ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలో చోటుచేసుకుంది. జగదేవపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామానికి చెందిన ఎర్ర కరుణాకర్ (30) కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరుణాకర్ ఈ నెల 18న కూలి పని కోసమని వెళ్లి రాత్రి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు తెలిసిన వారి వద్ద, బంధుమిత్రుల వద్ద ఆరా తీసినా కరుణాకర్ ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు ఈ నెల 20న జగదేవపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

yearly horoscope entry point

మొబైల్ ఫోన్ ను అమ్మకానికి పెట్టడంతో

శనివారం జగదేవపూర్ కి చెందిన స్వామి అనే యువకుడు మొబైల్ ఫోన్ ని ఒక వైన్ షాప్ వద్ద అమ్మడానికి ప్రయత్నించాడు. అది గమనించిన వైన్ షాప్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకొని విచారించగా కరుణాకర్ హత్య విషయం బయటపడింది. అయితే కరుణాకర్ ఈ నెల 18న రోజు ఇంటి నుంచి వెళ్లి జగదేవపూర్ లోని వైన్స్ షాప్ లో మద్యం తాగి సమీపంలో ఉన్న చెట్టుకింద పడుకున్నాడు.

డబ్బు కొట్టేయాలని ప్లాన్

అక్కడ చెట్టు కింద జగదేవపూర్ కి చెందిన రాగుల గణేష్ , కొంపల్లి నాగరాజు కలిసి మద్యం తాగుతూ కరుణాకర్ వద్ద డబ్బులు ఉన్న విషయాన్ని గమనించారు. కాసేపటికి వారు కరుణాకర్ వద్దకు వచ్చి పరిచయం చేసుకొని ముగ్గురు కలిసి రాత్రి మద్యం తాగారు. ఆ మత్తులో గణేష్, నాగరాజు డబ్బుల కోసం కరుణాకర్ తో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో కరుణాకర్ ను కింద తోసేసి గొంతు నులిపి హత్య చేశారు. అతడి వద్ద ఉన్న రూ. 30 వేల నగదు, మొబైల్ ఫోన్ తీసుకొని మృతదేహాన్ని సమీపంలోని చెరువులో పడేసి వెళ్లిపోయారు. స్వామి ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.

పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన

ఆదివారం జగదేవపూర్ చెరువులో నుంచి కరుణాకర్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈవిషయం తెలిసుకున్న ఏసీపీ రమేష్ జగదేవపూర్ చేరుకొని నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

రిపోర్టింగ్ : హెచ్.టి తెలుగు ప్రతినిధి, సిద్దిపేట

Whats_app_banner