Sangareddy Crime : ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంట్లో చోరీ, 48 గంటల్లో ఛేదించిన జహీరాబాద్ పోలీసులు
Sangareddy Crime : జహీరాబాద్ లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 48 గంటల్లో నిందితుడ్ని పట్టుకున్నారు.
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల దంపతుల ఇంట్లో గురువారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. ఈ కేసును జహీరాబాద్ పట్టణ పోలీసులు 48 గంటలలో ఛేదించి, చోరీ అయిన 13 తులాల బంగార ఆభరణాలను నిందితుడు నుంచి రికవరీ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జహీరాబాద్ పట్టణంలో మహ్మద్ ఇమ్రాన్ అహ్మద్ ఖాన్, అతని భార్య ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఈ నెల 9వ తేదీ ఉదయం 9:30 ఆ ఉపాధ్యాయ దంపతులు ఇద్దరు ఇంటికి తాళం వేసి, తమ విధులకు వెళ్లారు.
మిట్ట మధ్యాహ్నమే దొంగతనo
మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో భోజనానికి ఇంటికి వచ్చిన వారు, ఇంటి తాళం పగలగొట్టి ఉండటం చూసి షాక్ కు గురయ్యారు. వెంటనే ఇంటి లోనికి వెళ్లి చూడగా అల్మారా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. అల్మారాలో చూడగా అందులో 13 తులాల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆ బంగారు ఆభరణాలలో గోల్డ్ నెక్లెస్ 2 తులాలు, గోల్డ్ హారం 5 తులాలు, గోల్డ్ మంగళసూత్రం 4 తులాలు, 6-గోల్డ్ రింగ్స్ 2-తులాలు. మొత్తం 13 తులాల ఆభరణాలు. తమ ఇంట్లో ఎవరో గుర్తుతెలియని దొంగలు పట్ట పగలే ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి అల్మారాలో బంగారు ఆభరణాలను దొంగిలించారని జహీరాబాద్ పట్టణ పోలీసులకు ఖాన్ దంపతులు ఫిర్యాదు చేశారు. వెంటనే పట్టణ ఇన్స్పెక్టర్ రాజు దర్యాప్తు ప్రారంభించి, చోరీ జరిగిన స్థలానికి వెళ్లి పూర్తి సాక్షాధారాలను సేకరించారు. దొంగతనం జరిగిన ఆ ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన నేరస్తులను గుర్తించారు.
జహీరాబాద్ డీఎస్పీ రఘు ఆదేశాలతో స్పెషల్ టీంను ఏర్పాటు చేసి ఆదివారం రోజు ఉదయం 4 గంటలకు మాఫీల్ దాబా హోటల్ వద్ద నిందితుడిని (18 సంవత్సరాల లోపు నేరస్తుడు) పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
మరో ఇద్దరి కోసం గాలింపు
ఈ కేసులో మైనర్ పెద్దమ్మ రేఖ, ఆమె కుమారుడు ప్రేమ్ తనను ప్రోత్సహించినట్టు తెలిపారు. ఇంకా అతని పెద్దమ్మ రేఖ, ఆమె కుమారుడు ప్రేమ్ పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి, పోలీసులు టీమ్ ఏర్పాటు చేశారు. రెండు రోజుల వ్యవధిలో కేసులు ఛేదించి దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న జహీరాబాద్ టౌన్ పోలీస్ సిబ్బందిని, జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అభినందించి, రివార్డులు ప్రకటించారు. నేరాలు జరగకుండా అరికట్టడంలో, జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ వివిధ గ్రామాలలో, ప్రధాన కూడళ్లలో స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.