Sangareddy Crime : ముత్తంగి టోల్ గేట్ వద్ద కారులో 84 కేజీల గంజాయి సీజ్, నిందితుడు అరెస్ట్
Sangareddy Crime : ఏవోబీ సరిహద్దు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ.12 లక్ష విలువైన 84 కిలోల గంజాయిని సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.
Sangareddy Crime : అక్రమంగా తరలిస్తున్న రూ.12 లక్షల విలువైన గంజాయిని, సంగారెడ్డి జిల్లా ముత్తoగి టోల్ ప్లాజా వద్ద మెదక్ డివిజన్ ఎక్స్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పటాన్ చెరు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తoగి టోల్ గేట్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కారులో అక్రమంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న రూ.12 లక్షల విలువైన 84 కేజీల గంజాయిని, రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి నల్గొండ జిల్లా చందంపేట మండలం పట్టి గ్రామానికి చెందిన రామావత్ రాకేష్ చంద్రగా గుర్తించారు. అతడు సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో నివాసం ఉంటున్నాడు. అతని వద్ద నుంచి ఒక కారు,సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.
పరిశ్రమలలో పనిచేసే కార్మికులే లక్ష్యంగా గంజాయి సరఫరా
పరిశ్రమలలో పనిచేసే కార్మికులే లక్ష్యంగా గంజాయి, గంజాయి చాక్లెట్ లను విక్రయిస్తున్న ఓ కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి కిలోన్నర ఎండు గంజాయిని, మత్తు పదార్ధాలతో తయారుచేసిన చాక్లెట్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ శివారులో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన రాధేశ్యామ్, తన కుటుంబసభ్యులతో కలిసి కొన్ని సంవత్సరాలుగా హత్నూర మండలం మల్కాపూర్ శివారులోని వీఎస్ఆర్ గార్డెన్ సమీపంలో గల వ్యవసాయ క్షేత్రంలో నివాసముంటున్నారు. వీరి కుటుంబం చాలా కాలంగా గంజాయిని విక్రయిస్తుంది. దీంతో వీరు స్థానిక పరిశ్రమలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులనే లక్ష్యంగా చేసుకొని ఎవరికి తెలియకుండా రహస్యంగా గంజాయిని, మత్తు పదార్థాలతో తయారుచేసిన చాక్లెట్ లను విక్రయిస్తున్నారు. దీంతో పోలీసులు నమ్మదగిన సమాచారంతో రాధేశ్యామ్ అతని కుమారులు నివాసం ఉంటున్న నివాసాలలో తనిఖీలు నిర్వహించి, వారి ఇండ్లల్లో నుంచి కిలోన్నర ఎండు గంజాయిని, గంజాయి చాక్లెట్ లను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రాధేశ్యామ్ ను,గుండ్లమాచనూరు శివారు పరిశ్రమలో పనిచేస్తున్న అతని కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు జిన్నారం సీఐ తెలిపారు.
పోలీస్ శాఖ చిత్తశుద్ధితో కృషి
మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు ఎస్పీ రూపేష్. రాష్ట్రస్థాయిలో మాదకద్రవ్యాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి జిల్లాకు చేరుతున్నాయి. ఏయే ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు. ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది అనే వివరాలు పక్కాగా గుర్తిస్తూ, వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాలు వినియోగాన్ని నియంత్రించవచ్చని సూచించారు. ఆ దిశగా పోలీస్, ఎక్సైజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని ఎస్పీ సూచించారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఎక్సైజ్ తదితర శాఖలకు తమ పోలీసు శాఖ ద్వారా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని అన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా గంజాయి, డ్రగ్స్ కు సంబంధించి కేసులు అయినప్పుడు, ఆ సమాచారాన్ని పోలీస్ శాఖకు ఇవ్వాలని సూచించారు.
(హెచ్.టి.తెలుగు రిపోర్టర్, సంగారెడ్డి)
సంబంధిత కథనం