Reliance Foundation : తెలంగాణకు రూ.20 కోట్ల భారీ విరాళం అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్
Reliance Foundation : తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అపార నష్టం వాటిళ్లింది. ఈ నేపథ్యంలో దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి విరాళాలు ఇస్తున్నారు. తాజాగా.. రిలయన్స్ ఫౌండేషన్ తెలంగాణకు భారీ విరాళాన్ని అందజేసింది.
తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందజేసింది. సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.20 కోట్ల విరాళాన్ని రిలయన్స్ ఫౌండేషన్ అందజేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రిలయన్స్ సంస్థ ప్రతినిధులు విరాళం చెక్కును అందజేశారు. వారికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటివరకు ఈ స్థాయిలో ఎవరూ విరాళాన్ని ఇవ్వలేదు. చాలామంది ప్రముఖులు విరాళాలు ఇచ్చినా.. రూ.20 కోట్లు ఎవరూ అందజేయలేదు.
వరద బాధితులకు సహాయార్థం టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన మహేశ్ బాబు.. ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు. ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ తరపున కూడా మరో రూ.10 లక్షల విరాళం అందజేశారు. మహేశ్ వెంట సతీమణి నమ్రత కూడా ఉన్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
వరద బాధితుల సహాయార్థం కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్.. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయల విరాళం అందించింది. కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి. భాస్కర్ రావు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు.. ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
వరద బాధితులకు సాయం చేయడానికి కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.శంకర సుబ్రమణియన్, సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు.. ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
వరద బాధితుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ కోటి రూపాయల విరాళం అందించింది. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, ఎంపీ భరత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి చెక్కు అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి ఔదార్యం చాటుకున్న వారిని ముఖ్యమంత్రి అభినందించారు.