Vande Bharat Express : నాగ్‌పూర్- సికింద్రాబాద్ వందేభారత్.. ఇవాళ ప్రారంభించనున్న మోదీ.. ఛార్జీల వివరాలు ఇలా..-prime minister narendra modi will virtually flag off the nagpur secunderabad vande bharat express ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vande Bharat Express : నాగ్‌పూర్- సికింద్రాబాద్ వందేభారత్.. ఇవాళ ప్రారంభించనున్న మోదీ.. ఛార్జీల వివరాలు ఇలా..

Vande Bharat Express : నాగ్‌పూర్- సికింద్రాబాద్ వందేభారత్.. ఇవాళ ప్రారంభించనున్న మోదీ.. ఛార్జీల వివరాలు ఇలా..

Basani Shiva Kumar HT Telugu
Sep 16, 2024 09:20 AM IST

Vande Bharat Express : సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను పీఎం మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ రైలు 19వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు సికింద్రాబాద్ చేరుకునే సమయంలో స్వాగతం పలికేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌
నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (@trainwalebhaiya)

నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 4.15 గంటలకు వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్‌లో బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రాత్రి 10.45 గంటలకు చేరుకోనుంది. ఈ రైలుకు స్వాగతం పలికేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 19వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

ఛార్జీల వివరాలు ఇవే..

సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు ఏసీ ఛైర్ కార్- రూ.710, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్- రూ.1195

సికింద్రాబాద్ నుంచి రామగుండంకు ఏసీ ఛైర్ కార్- రూ.865, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్- రూ.1510

సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ వరకు ఏసీ ఛైర్ కార్- రూ.1500, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్- రూ.2785

సికింద్రాబాద్- నాగ్‌పూర్ వందేభారత్ రైలు.. నాగ్‌పూర్ నుండి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. 578 కిలోమీటర్ల ప్రయాణాన్ని 7.15 గంటల్లో పూర్తి చేయనుంది. ఈ రైలు కాజీపేట, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగనుంది.

ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా ప్రధానమంత్రి కేటాయించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ రైలు సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది. అదే సమయంలో విశాఖపట్టణం, దుర్గ్ (ఛత్తీస్‌గఢ్) మధ్య మరో వందేభారత్ రైలు సేవలందించనుంది. ఈ రెండు రైళ్లను ఇవాళ ప్రధానమంత్రి అహ్మదాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఆ రోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తగా 10 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు.

నాగ్‌పూర్ నుంచి మొదలయ్యే ఈ రైలు.. సికింద్రాబాద్ చేరుకునే సందర్భంలో స్వాగతం పలకాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి.. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పంపించారు. తెలంగాణలో రూ. 32,946 కోట్లతో రైల్వే సేవల అభివృద్ధికి కిషన్ రెడ్డి చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.5,336 కోట్లు కేటాయించినట్లు వివరించారు. రాష్ట్రంలోని 40 స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.