TG Vegetable Price : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలు
TG Vegetable Price : ఏం తినేటట్టు లేదు.,.ఏం కొనేటట్టు లేదు... నాగులో నాగన్న.. అనే పాట చందంగా మారింది మార్కెట్ పరిస్థితి. చౌకగా సరకులు తీసుకెళ్లాలని భావించిన పేదలు.. ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. పండగకు సరకులు కొనుగోలు చేద్దామని మార్కెట్‌కు వెళ్తున్న నిరుపేదలు.. వాటి ధరలు చూసి కంగుతింటున్నారు.
నిన్నమొన్నటి వరకు ఒక రకంగా ఉన్న నిత్యావసర సరకుల ధరలు.. పక్షం రోజుల్లోనే అమాంతం పెరిగిపోయాయి. దీంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. నిత్యం కూరల్లో వినియోగించే వంట నూనె, వెల్లుల్లి, ఉల్లిగడ్డల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వీటికి తోడు కూరగాయలు, ఆకుకూరల ధరలు అదే రీతిలో పెరిగిపోవడం.. సామాన్య, మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన వస్తువులు కావడంతో.. వీలైనంత తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
పండగ సందర్భాలు, పంటలు లేని సందర్భాల్లో నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు పెరిగిపోతున్నా.. వీటిని నియంత్రించేందుకు ఎలాంటి వ్యవస్థలు లేకపోవడం నిరుపేదలకు ఇబ్బందికరంగా మారుతోంది. వివిధ రకాల సరకుల ధరలు పదిహేను రోజుల క్రితం ఒక మాదిరిగా ఉండటం.. అంతలోనే వాటి ధరలు పెరిగిపోవడం వంటి ఊహించని పరిణామాలు.. పేదలను ఆర్దిక ఇబ్బందుల్లోకి నెట్టెస్తున్నాయి.
సరకుల కొనుగోలు పేదలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రోజువారీ కూలీలు, చిరుద్యోగులు, పేద, మద్య తరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. పదిహేను రోజుల క్రితం కిలో వంట నూనె రూ.110 వరకు ఉండగా.. ప్రస్తుతం కిలోకు ఆయా కంపెనీలను బట్టి రూ.135 నుంచి రూ. 140 వరకు పెరిగింది. ఇక నిత్యం వినియోగించే వెల్లుల్లి కిలోకు ఏకంగా రూ.360 వరకు ఎగబాకింది. ఉల్లిగడ్డలు కిలోకు రూ.80 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. పప్పులు, కుడుకలు (కొబ్బరి) ధరలు కూడా పెరగిపోయాయి.
కూర 'గాయాలు'..
నిత్యావసర సరకులకు తోడు.. కూరగాయలు, ఆకుకూరల ధరలు పెరగడంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. మూడు నెలల క్రితం రూ.100కిలో వరకు పలికిన టమాట ధర కొన్ని రోజుల వరకు తగ్గుముఖం పట్టింది. కానీ.. తాజాగా మళ్లీ కిలో రూ. 90వరకు పెరగడం ఆందోళనకరంగా మారింది. వీటితో పాటు వంకాయ కిలో రూ.90, క్యారెట్, కాకరకాయ, దొండకాయ కిలో రూ.80 చొప్పున ఉండగా.. బీరకాయ రూ.120, బెండ రూ.60, చిక్కుడు రూ.100, పచ్చిమిర్చి రూ.90, పువ్వుగోబి రూ.100 వరకు పలుకుతోంది.
వీటితో పాటు ఆకుకూరల ధరలు అదే స్థాయిలో ఉన్నాయి. పాలకూర, మెంతికూర కట్టలు రూ.15 చొప్పున ఉండగా.. కొత్తిమీర రూ. 10చొప్పున అమ్ముతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటల కాలం పూర్తయినప్పటికీ కూరగాయల సాగు తక్కువగా ఉండటం.. బయటి ప్రాంతాల నుంచి రావడం వంటి కారణాలతో రవాణా ఛార్జీలు అధికం కావడంతో.. ఈ పరిస్థితి ఉందని తెలుస్తోంది.
ధరల నియంత్రణ ఏదీ..?
మార్కెట్లో నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు పెరిగితే.. పేద, మద్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. వారికి వచ్చే ఆదాయంలో వీటిని కొనుగోలు చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ధరలు పెరిగితే కారణాలు తెలుసుకొని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవలసిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
చాలా వరకు వస్తువులు ప్రభుత్వ నియంత్రణలో లేకపోవడం.. ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోవడంతో ధరల పెరుగుదలకు కారణమవుతోందని తెలుస్తోంది. ప్రైవేటు వ్యాపారులు గోదాముల్లో సరకులు నిల్వ చేసుకొని.. కృత్రిమ కొరత సృష్టించడం మూలంగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
(రిపోర్టింగ్- వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)