MLAs Poaching Case: రంగంలోకి ED…విచారణలో నందకుమార్ ఏం చెబుతారు..?-nampally court allowed the ed to interrogate nandakumar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Nampally Court Allowed The Ed To Interrogate Nandakumar

MLAs Poaching Case: రంగంలోకి ED…విచారణలో నందకుమార్ ఏం చెబుతారు..?

Mahendra Maheshwaram HT Telugu
Dec 25, 2022 06:55 AM IST

ED to interrogate Nandakumar: ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ ను విచారించేందుకు ఈడీకి నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ ను సోమవారం ఈడీ విచారించనుంది.

ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం

Court allowed the ED to interrogate Nandakumar: ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చేసుకుంది. నందకుమార్‌ ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు శనివారం అనుమతించింది. ఓవైపు సిట్‌ ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసి ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, సెవెన్‌హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ ఆవాలాను ఈడీ విచారించింది. తాజాగా నంద కుమార్ ను విచారించేందుకు అనుమతి రావటంతో ఏం జరగబోతుందనేది ఆసక్తిని రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ ను సోమవారం ఈడీ అధికారులు జైల్లోనే విచారించనున్నారు. ఈ విచారణ కేవలం ఒక్కరోజు మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది. ఈ విచారణలో భాగంగా నందకుమార్ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తుంది. నందకుమార్‌ను విచారణకు అనుమతించాలని నాంపల్లి మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేసింది ఈడీ. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తాము పరిశీలించామని.. అందులో రూ.వందల కోట్ల డీల్‌ గురించి చర్చించినందున మనీ లాండరింగ్‌కు సంబంధించి ఆధారాలున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. ఫలితంగా ఈసీఐఆర్‌ నమోదు చేశామని పిటిషన్ లో వివరించింది. ఈ కేసులో నిందితుడు నందకుమార్‌ను విచారించి కీలక సమాచారం రాబట్టేందుకు అనుమతించాలని కోరింది. నందకుమార్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు నలుగురు అధికారులతో కూడిన బృందాన్ని అనుమతించేలా చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారిని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు… ఈడీకి అనుమతి ఇచ్చింది.

ఏం చెబుతాడు..?

ఈడీ విచారణలో నందకుమార్ నోరు విప్పితే ఏం జరుగుతుంది? ఆయన ఏయే విషయాలను వెల్లడిస్తాడు? ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడతాయి? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముడిపడి ఉన్న మాణిక్‌చంద్‌ గుట్కా కేసుపైనా ఈడీ దృష్టి సారించే అవకాశం ఉంది. చంచల్‌గూడ జైలులో నందకుమార్ విచారణను వీడియో కెమెరాలో రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, అతని సోదరుడితో నందుకు సుదీర్ఘ పరిచయం ఉన్నట్లు ఇప్పటికే దర్యాప్తు సంస్థల విచారణలో వెలుగులోకి వచ్చింది. వారితో కలిసి నందకుమార్ పలు వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎమ్మెల్యేల ఎర కేసుతో పాటు మాణిక్‌చంద్‌ గుట్కా కేసుకు సంబంధించిన కీలక విషయాలను రాబట్టే అవకాశం కూడా ఉంది. నందకుమార్ చెప్పే సమాచారం, వెల్లడించే పేర్ల ఆధారంగా ఈడీ మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం కూడా ఏర్పడుతుంది.

ఎమ్మెల్యేల ఎర కేసులోకి ఈడీ ఎంట్రీ ఇవ్వటం, నందకుమార్ విచారణకు అనుమతి కూడా పొందటంతో కేసు మరో టర్న్ తీసుకున్నట్లు అయింది. ఈ నేపథ్యంలో నందకుమార్ ఎలాంటి సమాచారం ఇస్తారనేది మాత్రం అత్యంత ఆసక్తిని రేపుతోంది.

IPL_Entry_Point