Nanda Kumar : నందకుమార్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం… రామచంద్రభారతిపై కూడా మరో కేసు..-telangana police ready to arrest mlas poaching case accused in other cases ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Police Ready To Arrest Mlas Poaching Case Accused In Other Cases

Nanda Kumar : నందకుమార్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం… రామచంద్రభారతిపై కూడా మరో కేసు..

HT Telugu Desk HT Telugu
Dec 03, 2022 09:42 AM IST

Nanda Kumar టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసులో అరెస్టైన నందకుమార్‌ను మరో కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. తనది కాని స్థలాన్నిమరొకరికి లీజుకిచ్చారనే అభియోగాలపై నంద కుమార్‌పై కేసు నమోదైంది. అటు రామచంద్రభారతిపై కూడా పలు అభియోగాలతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో వెలుగులోకి కీలక విషయాలు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో వెలుగులోకి కీలక విషయాలు (HT)

Nanda Kumar హైదరాబాద్‌లో సినీ దర్శకుడు దగ్గుబాటి సురేష్‌ బాబుకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని అందులో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో పాటు మరొకరికి సబ్‌లీజుకు ఇవ్వడంపై పోలీస్ కేసు నమోదైంది. ఫిలిం నగర్‌లో దగ్గుబాటి సురేష్‌బాబుకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్న నందకుమార్‌ అందులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. వీటిపై కార్పొరేషన్‌కు ఫిర్యాదులు రావడంతో వాటిని కూల్చివేశారు. దగ్గుబాటి సురేష్‌బాబు నుంచి లీజుకు తీసుకున్న స్థలాన్ని నందకుమార్‌ మరొకరికి సబ్‌ లీజుకు ఇచ్చారు. ఇందులో మియాపూర్‌కు చెందిన ఇందిర అనే మహిళ బాంబే గార్మెంట్స్‌ దుకాణాన్ని ఏర్పాటు చేశారు.

స్థలాన్ని లీజుకిచ్చే విషయంలో నందకుమార్‌ తమను మోసం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుకాణం ఏర్పాటు చేయడానికి తమ దగ్గర రూ.13.5 లక్షల నగదు తీసుకున్నారని, నెలకు రూ.1.5లక్షలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారుు. జిహెచ్‌ఎంసి కూల్చివేతల వల్ల తమకు నష్టం జరగడానికి నందకుమార్‌ బాధ్యుడని అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్‌కు ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చీటింగ్ కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కోర్టు అనుమతి కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. నాంపల్లి మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును శనివారానికి వాయిదా వేసింది.

రామచంద్ర భారతిపై రోహిత్ రెడ్డి పిర్యాదు….

ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న రామచంద్రభారతిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామచంద్రభారతికి రెండు ఆధార్ కార్డులు, రెండు పాన్ కార్డులు, రెండు డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నాయని రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రభారతి ఫోన్‌లో రెండు వేర్వేరు పాస్‌పోర్టులతో కూడిన వివరాలు పోలీసులకు దొరికాయి. దీనిపై సిట్ అధికారి గంగాధర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ గంగాధర్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారకు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేయడంతో వారు బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు బంజారాహిల్స్ పోలీసులు సిద్ధం అవుతున్నారు.

IPL_Entry_Point