SIT LookOut Notice : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు...ముగ్గురికి సిట్ లుకౌట్ నోటీసులు-telangana police issued lookout notices to bjp general secretary bl santosh ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Police Issued Lookout Notices To Bjp General Secretary Bl Santosh

SIT LookOut Notice : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు...ముగ్గురికి సిట్ లుకౌట్ నోటీసులు

HT Telugu Desk HT Telugu
Nov 22, 2022 12:48 PM IST

SIT LookOut Notice ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ విచారణకు గైర్హాజరైన ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విచారణకు రాకపోవడంతో వారు పరారీలో ఉన్నట్లు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి తారాస్థాయికి చేరుకున్నట్లు భావిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ అస్త్రాలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.

బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్‌ సంతోష్‌కు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సిట్
బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్‌ సంతోష్‌కు లుకౌట్ నోటీసులు జారీ చేసిన సిట్ (HT_PRINT)

SIT LookOut Notice కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తలెత్తిన వివాదాలు ముదురుతున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ వ్యవహారంతో బయటపడ్డ వివాదాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో సిఎం కేసీఆర్ కుమార్తె పాత్ర ఉందంటూ మొదట టిఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో టిఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు ఇబ్బందులు తప్పవని విస్తృత ప్రచారం జరిగింది. ఇదే సమయంలో అనూహ్యంగా తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసు తెరపైకి వచ్చింది. నలుగురు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు కలకలం రేపాయి.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ అగ్రనాయకుడు బీఎల్‌ సంతోష్‌ పేరు తెరపైకి రావడం బీజేపీకి మింగుడు పడలేదు. ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపిన రామచంద్రభారతి ఫోన్ నుంచి సంతోష్‌ ఫోన్‌కు మెసేజీలు వెళ్లడంతో ఆయనను విచారణకు రావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సంతోష్‌ను అరెస్ట్ చేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశించి, విచారణకు సహకరించాలని సూచించింది. అయితే బిఎల్‌ సంతోష్‌ సోమవారం నాటి విచారణకు హాజరు కాలేదు. దీంతో బిఎల్‌ సంతోష్‌తో పాటు మరో ఇద్దరిపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు వేగంగా సాగుతోంది. నోటీసులు ఇచ్చినా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌తోపాటు కేరళకు చెందిన తుషార్‌, జగ్గు స్వామి విచారణకు హాజరుకాకపోవడాన్ని సిట్‌ తీవ్రంగా పరిగణిస్తోంది.

ముగ్గురిపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ పరిస్థితి అనుమానితులను అరెస్టుల చేసే వరకూ వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఎల్‌ సంతోష్‌తో పాటు మిగిలిన ఇద్దరిపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తులో వెల్లడవుతున్న ఆధారాల ప్రకారం సిట్‌ అధికారులు మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సిట్‌ విచారించే వారిలో పలువురు రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో దాదాపు ఆరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగినట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలతో కూడా నిందితులు చర్చించినట్లు ఫోన్‌ రికార్డుల ద్వారా వెలుగుచూసింది. వీటి ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో వీరిపై కేసులు నమోదు చేయించాలనే ఆలోచనలో టిఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

పోటాపోటీగా దర్యాప్తులు…..

ఓ వైపు బీజేపీ నేతలపై సిట్ దర్యాప్తు మరోవైపు తెలంగాణ నాయకులే లక్ష్యంగా ఈడీ, ఐటీ దర్యాప్తులు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో సిబిఐ దర్యాప్తుకు సమ్మతిని ఉపసంహరించడంతో ఈడీ, ఐటీలను ప్రయోగిస్తున్నారని టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంపై పెద్ద ఎత్తున ఐటీ సోదాలు జరుపుతుండటంతో టిఆర్‌ఎస్‌ నేతలు అప్రమత్తమయ్యారు. తెలంగాణ భవన్‌లో పలువురు నేతలు భేటీ అయ్యారు.

టిఆర్‌ఎస్‌ పార్టీని ఇరుకున పెట్టేందుకు ఆ పార్టీకి చెందిన ప్రముఖుల్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పటికే వ్యాపార కార్యకలాపాల్లో పార్థసారథిరెడ్డి, నామా నాగేశ్వరరావులపై ఈడీ దాడులు చేసింది. ఆ తర్వాత గ్రానైట్‌ లావాదేవీల్లో మనీ లాండరింగ్ జరిగిందంటూ వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్‌లపై దాడులు జరిగాయి. చికోటీ ప్రవీణ్‌ క్యాసినో వ్యవహారంలో ఎమ్మెల్సీ రమణను ప్రశ్నించారు. తాజగా మల్లారెడ్డిపై ఐటీ దాడులు జరుగుతుండటంతో పథకం ప్రకారమే బీజేపీ దాడులు జరిపిస్తోందని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది.

నిరసనలకు సిద్ధమైన టిఆర్‌ఎస్….

టిఆర్‌ఎస్ నాయకులపై జరుగుతున్న వరుస దాడులకు నిరసన తెలపాలని టిఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఐటీ, ఈడీ కార్యాలయాల ఎదుట టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలను పార్టీ పరిశీలిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వంపై కక్ష సాధింపుకు పాల్పడుతోందని టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.

IPL_Entry_Point