Minister Srinivas Goud : అజారుద్దీన్ పై మంత్రి శ్రీనివాస్ సీరియస్.. మీదే లోపం!
Minister Srinivas Goud On Cricket Match : హైదరాబాద్ లో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష చేశారు. తొక్కిసలాటపై స్పందించారు. పోలీసుల వైఫల్యం ఏం లేదని చెప్పారు.
హైదరాబాద్ జింఖానా మైదానం(gymkhana ground)లో తొక్కిసలాటపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. అజారుద్దీన్, సీపీ మహేష్ భగవత్, క్రీడాశాఖ కార్యదర్శి, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కరోనా తర్వాత జరిగే మ్యాచ్ అని, డిమాండ్ ఎక్కువగా ఉందని శ్రీనివాస్ గౌడ్(minister srinivas goud) అన్నారు. తెలంగాణ వచ్చాక జరగుతున్న సెకండ్ మ్యాచ్ ఇది అని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలనేది తమ ఉద్దేశమని చెప్పారు. .
'పెద్ద ఈవెంట్ కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. చిన్న ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ సహకారం అందిస్తాం. హైదరాబాద్(Hyderabad) ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోం. తెలంగాణ(Telangana)కు పేరు తెచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తాం. మ్యాచ్ బాగా జరిగితే మరిన్ని మ్యాచ్‌లు తెలంగాణకు వస్తాయి. క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలు ఇవ్వడంలో తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారు.' అని మంత్రి శ్రీనివాస్ అన్నారు.
టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మ్యాచ్ నిర్వహణలో పోలీసుల వైఫల్యం లేదని స్పష్టం చేశారు. హెచ్‌సీఏ(HCA) సమన్వయ లోపం వల్లే ఘటన జరిగిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగవని హెచ్‌సీఏ హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. ఆఫ్‌లైన్‌లో టికెట్లు లేటుగా వచ్చాయని.. అందుకోసమే ఇలా జరిగిందన్నారు.
ఈ సమావేశంలో తొక్కిసలాటపై హెచ్‌సీఏ ఛైర్మన్ అజారుద్దీన్(azharuddin) మాట్లాడారు. ఏం జరిగిందనే విషయంపై నివేదిక ఇస్తామన్నారు. లోపాన్ని సవరించుకుంటామన్నారు. తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణకు మరింత పేరు వచ్చేలా హెచ్‌సీఏ చర్యలు తీసుకుంటుందన్నారు. మ్యాచ్ నిర్వహణ కూర్చుని మాట్లాడుకునేంత సులభం కాదని వ్యాఖ్యానించారు.
'చాలా ఏళ్ల తర్వాత మ్యాచ్ నిర్వహించుకునే అవకాశం వచ్చింది. మ్యాచ్ నిర్వహించే అవకాశం రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. మ్యాచ్ నిర్వహణను నెగిటివ్ కోణంలో చూడొద్దు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. బాధితులకు హెచ్‌సీఏ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుంది.' అని అజారుద్దీన్ అన్నారు.