PFI Case: పీఎఫ్ఐ కేసులో మరోసారి ఎన్ఐఏ సోదాలు.. హైదరాబాద్ లో ఆఫీస్ సీజ్..!
nia on pfi case: టెర్రర్ ఫండింగ్ వ్యవహారంలో ఎన్ఐఏ దూకుడు పెంచుతోంది. తాజాగా గురువారం ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఇందులో తెలంగాణ, ఏపీ, కేరళ, కర్ణాటకలోని పలు ప్రాంతాలు ఉన్నాయి.
NIA Conducting Searches in Telugu States: తెలంగాణలో మరోసారి ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్ఐ కేసు సంబంధించి ఇవాళ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. పలు మతపరమైన సంస్థలలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు, కర్ణాటక ,కేరళ, ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హైదరాబాద్ తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, కర్నూలు నగరాలు ఉన్నాయి.
చాంద్రాయగుట్టలో ఆఫీస్ సీజ్…
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో వంద చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ఐ కార్యకర్తల పనితీరుపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ దాడుల్లో భాహంగా ఇప్పటివరకు వంద మంది అరెస్ట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో చేపట్టిన సోదాల్లో భాగంగా చాంద్రాయగుట్టలో పీఎఫ్ఐ ఆఫీస్ ను సీజ్ చేశారు. హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ తో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఉప్పల్, ఘట్ కీసర్ లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.కరీంనగర్ లో 8 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు పట్టణంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.
NIA Searches in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 18వ తేదీన కూడా ఉదయం నుంచే నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాడులు చేపట్టింది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించగా... కర్నూలు, కడప జిల్లాల్లో మరో 23 బృందాలతో సోదాలు జరిపారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజానగర్ లో సోదాలు చేపట్టారు. ఉగ్ర మూలాలు ఉన్నాయనే సమాచారం తో ఇలియాజ్ అనే వ్యక్తి ఇంటిలో సోదాలు నిర్వహించారు. పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాలలోనూ సోదాలు జరుగుతున్నాయి. యూనస్ అహ్మద్ ఇంట్లో సోదాలు జరిగాయి. విచారణ నిమిత్తం నంద్యాలకు చెందిన యూనిస్ అహ్మద్ ను అదుపులోకి కూడా తీసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐ( పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) పేరుతో ఓ సంస్థ సంఘ ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతుందని ఫిర్యాదులు రావడంతో జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరాటే, లీగల్ అవేర్‌నెస్ శిక్షణ పేరుతో వీరికి శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. వీరికి పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న సమాచారంతో కేసును ఎన్ఐఏకి అప్పగించారు రాష్ట్ర పోలీసులు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ బృందాలు... దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఈ సంస్థకు భైంసా అల్లర్లతో సంబంధాలు ఏమైనా ఉన్న కోణంలో కూపీలాగే పనిలో పడ్డారు.