Prabhas Ravan Dahan: రామ్‌లీలా మైదానంలో రావణ దహనం చేయనున్న ప్రభాస్‌-prabhas to do ravan dahan in ramleela maidan this year at dasara celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas To Do Ravan Dahan In Ramleela Maidan This Year At Dasara Celebrations

Prabhas Ravan Dahan: రామ్‌లీలా మైదానంలో రావణ దహనం చేయనున్న ప్రభాస్‌

Hari Prasad S HT Telugu
Sep 12, 2022 05:29 PM IST

Prabhas Ravan Dahan: ఈ ఏడాది రామ్‌లీలా మైదానంలో రావణ దహనం చేయనున్నాడు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. దసరా ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.

ప్రభాస్
ప్రభాస్ (HT_PRINT)

Prabhas Ravan Dahan: టాలీవుడ్ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ ఏడాది ఢిల్లీలోని లవకుశ రామ్‌లీలా మైదానంలో జరగబోయే దసరా ఉత్సవాల్లో రావణ దహనం చేయనున్నాడు ప్రభాస్‌. ఇప్పటికే రామ్‌లీలా కమిటీ సభ్యులు అతన్ని సంప్రదించారు. దసరా ఉత్సవాలకు అతిథిగా వచ్చి రావణ దహనం చేయాలని వాళ్లు కోరారు.

దీనికి ప్రభాస్‌ కూడా అంగీకరించాడు. ఈ ఏడాది అక్టోబర్‌ 5న విజయ దశమి వేడుకలు జరగనున్నాయి. అయితే సెప్టెంబర్‌ 26 నుంచే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈసారి అయోధ్యలోని రామ మందిరం రూపంలో నిర్వాహకులు మండపాన్ని నిర్మించనున్నారు. ప్రతి ఏటా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా రోజు రావణ దహనం చేస్తారన్న విషయం తెలిసిందే.

ఇక ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే వేడుకలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి. అలాంటి వేడుకలకు ప్రభాస్‌ గెస్ట్‌ రావడం చాలా సంతోషంగా ఉందని లవకుశ రామ్‌లీలా కమిటీ చీఫ్‌ అర్జున్‌ కుమార్‌ అన్నారు. రానున్న ఆదిపురుష్‌ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తున్నాడని, రావణ దహనం చేయడానికి అతనికి మించిన వ్యక్తి ఇంకెవరు ఉంటారని ఆయన అనడం గమనార్హం.

ఓం రౌత్‌ డైరెక్షన్‌లో ఆదిపురుష్‌ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ కనిపిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రావణుడితోపాటు కుంభకర్ణుడు, మేఘనాథ్‌ల భారీ దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయనున్నట్లు అర్జున్‌ కుమార్‌ చెప్పారు.

రావణుడితోపాటు ఈ కుంభకర్ణుడు, మేఘనాథ్‌ల బొమ్మలను ప్రభాసే దహనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ విల్లుతో బాణాన్ని సంధిస్తూ రావణ దహనం చేస్తారు. ఇక ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్‌ కానుంది. ఇక ప్రభాస్‌ బర్త్‌డే అయిన అక్టోబర్‌ 23న ఆదిపురుష్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.