TG Revenue Department : రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన.. కలెక్టర్ల అనుమతితోనే తహశీల్దార్లపై కేసులు: పొంగులేటి-minister ponguleti srinivas reddy meeting with tahsildars of telangana revenue department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Revenue Department : రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన.. కలెక్టర్ల అనుమతితోనే తహశీల్దార్లపై కేసులు: పొంగులేటి

TG Revenue Department : రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన.. కలెక్టర్ల అనుమతితోనే తహశీల్దార్లపై కేసులు: పొంగులేటి

TG Revenue Department : తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖిగా మాట్లాడారు. సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామన్నారు. కలెక్టర్ల అనుమతితోనే తహశీల్దార్లపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల కోసం ట్రైనింగ్‌ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

గత పాలనలో రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగం చేశారని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం పటిష్టమైన, పారదర్శకమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించేందుకు.. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం శామీర్‌పేటలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో 33 జిల్లాల తహశీల్దార్‌లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులు, సామాన్య ప్రజలకు మేలు చేయడమే కొత్త చట్టం లక్ష్యమని వెల్లడించారు. ముసాయిదా ప్రక్రియ తుదిదశకు చేరుకుందని.. త్వరలో అమలులోకి వస్తుందని చెప్పారు.

ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములను కాపాడటంలో రెవెన్యూ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతున్నట్టు పొంగులేటి స్పష్టం చేశారు. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "రెవెన్యూ కార్యాలయాలను సందర్శించే పౌరులకు సిబ్బంది పూర్తిగా సహకరించాలి. వారి సమస్యలను పరిష్కరించడానికి శ్రద్ధగా పని చేయాలి" అని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి.. పథకాలు ప్రజలకు చేరేలా చేయడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పొంగులేటి ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అంతరాన్ని పూడ్చడంలో తహశీల్దార్లదే కీలకపాత్ర అని కొనియాడారు. ప్రజలు ఆశించిన విధంగా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందో లేదో ఉద్యోగులు ఆలోచించుకోవాలని కోరారు.

'రైతులు, పేదలు, సామాన్య పౌరుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం ద్వారా.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వ ప్రతిష్టను పెంచడానికి రెవెన్యూ ఉద్యోగులు కృషి చేయాలి. ఈ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది' అని పొంగులేటి స్పష్టం చేశారు.

కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే.. తహశీల్దార్లపై కేసులు నమోదు చేసేలా రాష్ట్ర డీజీపీతో చర్చలు జరుపుతామని మంత్రి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రెవెన్యూ సిబ్బంది కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సరిపడా కార్యాలయాలు ఏర్పాటు చేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా, అవసరమైన సిబ్బందిని నియమించకుండానే గత ప్రభుత్వం హడావుడిగా మండలాల సంఖ్యను విస్తరించిందని అదికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.

రెవెన్యూ శాఖలో ఉన్న లోటుపాట్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల నుండి పెండింగ్‌లో ఉన్న తహశీల్దార్ల బదిలీలపై సంబంధిత కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మాట్లాడారు. సమర్థవంతమైన పనితీరు.. ప్రజల సంక్షేమంపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిష్టకు దోహదం చేస్తుందని చెప్పారు. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఫైళ్లను క్లియర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.