Nagole Flyover Inaugurated : ఇక నాగోల్ ఫ్లైఓవర్ పై రయ్.. రయ్
Nagole Flyover: నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Nagole Flyover in Hyderabad: భాగ్యనగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం నాగోల్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 143 కోట్లతో 990 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కావటంతో నాగోల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నామన్నారు. నాగోల్ ఫ్లైఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, ల్యాండ్ అక్విజిషన్, ప్రాజెక్ట్‌తో కలిపి మొత్తం రూ.143.58 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుందన్నారు.
హైదరాబాద్ లో ఇప్పటివరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేటీఆర్ చెప్పారు. మరో 16 పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. నాగోల్ ఫ్లైఓవర్ 16వది అని తెలిపారు. చాలా మంది ప్రజలు నగరంలోకి రావడానికి ఇదే ప్రధాన మార్గమన్నారు. మాదాపూర్, గచ్చిబౌలిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి త్వరలో మరో రెండు ఫ్లై ఓవర్లు రానున్నాయని తెలిపారు. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్ కాగా మరొకటి శిల్పా లేఅవుట్ వద్ద బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రెండు వైపుల ప్రయాణించేలా ఉన్న ఫ్లైఓవర్‌కు సంబంధించి ఫొటోలతో పాటు ఓ వీడియోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా నిర్మాణమైన నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్‌బీనగర్‌ల మీదుగా ఉప్పల్ వరకు వచ్చేవారు సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఫలితంగా చాలా మేరకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి.