Telangana Intermediate : ఇకపై ఇంటర్‌లో ధ్యానం, యోగా తప్పనిసరి - కాలేజీలకు ఆదేశాలు!-meditation and yoga is a must in telangana intermediate ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Intermediate : ఇకపై ఇంటర్‌లో ధ్యానం, యోగా తప్పనిసరి - కాలేజీలకు ఆదేశాలు!

Telangana Intermediate : ఇకపై ఇంటర్‌లో ధ్యానం, యోగా తప్పనిసరి - కాలేజీలకు ఆదేశాలు!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 10, 2023 06:33 AM IST

Telangana Intermediate Board: విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని కాలేజీల్లో ధాన్యం, యోగతో పాటు రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కాలేజీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కాలేజీల్లో యోగ, ధ్యానం
కాలేజీల్లో యోగ, ధ్యానం (unsplash)

Telangana Intermediate: ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి గురికావటం, ఆత్మహత్యలు చేసుకోవటం వంటి ఘటనలు ప్రతి ఏడాది చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టే పనిలో పడింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో ధ్యానం, యోగాతో పాటు రిలాక్సేషన్‌ ఎక్సర్‌సైజులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఇంటర్‌ విద్యాశాఖ కాలేజీలకు ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుచొని ఇంటర్ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయాలను అన్ని కాలేజీలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. విద్యార్థుల, శారీరక, మానసిక శ్రేయస్సు కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇంటర్‌ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది.

విద్యార్థులు ఆందోళన, ఒత్తిడిలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. వీటిని అధిగమించడంతోపాటు, కెరీర్‌ కౌన్సిలింగ్‌, ఏకాగ్రతను మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని సూచించింది. నెలలో ఒక్కసారి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపింది. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక సాయంత్రం సమయాల్లో ఆటలు, క్రీడలు తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది. కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సైకాలజికల్‌ కౌన్సిలర్లను నియమించుకోవాలని.... కేవలం అకడమిక్‌ పనితీరే కాకుండా విద్యార్థుల మానసిక ఒత్తిడిని పరిశీలించాలని దిశానిర్దేశం చేసింది. నిపుణులతో ఉపన్యాసాలు, స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆదేశాల్లో వివరించింది.

ఇంగ్లీష్ లో ప్రాక్టికల్స్….

మరోవైపు ఇంటర్మీడియెట్‌లో సైన్స్‌ విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రాక్టికల్‌ విధానం ఇక ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లోనూ అమలు చేసేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆ దిశగా విధి విధానాలను సిద్ధం చేసి త్వరలోనే విడుదల చేయనుంది. ఇంటర్‌లో ఇప్పటి వరకు ఎంపీసీ, బీపీసీ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్స్‌ ఉండేవి. ఇక ఇప్పుడు ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్‌ ఉండనున్నాయి. మొత్తం 100 మార్కులకు ప్రాక్టికల్స్‌ 20, థియరీకి 80 మార్కులు కేటాయించారు. ఇందులో నాలుగు దశలు ఉంటాయని తెలుస్తోంది. నేర్చుకోవడం, మాట్లాడటం, రాయటం, ప్రశ్నించటం వంటివి ఉంటాయి. ఇలా ఒక్కో దశకు ఐదు మార్కుల చొప్పున 20 మార్కులు కేటాయిస్తారు.ప్రాక్టికల్‌ విధానంతో విద్యార్థులకు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ పెరిగి భవిష్యత్తులో ఉద్యోగ సాధనతో పాటు ఏ ప్రాంతానికి వెళ్లినా సులభంగా అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.