Korutla Software Engineer : కోరుట్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ డెత్ మిస్టరీ, తాను చంపలేదని సోదరి వాయిస్ మెసేజ్!
Korutla Software Engineer : కోరుట్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దీప్తి మృత్తి మిస్టరీగా మారింది. పోస్టు మార్టం నివేదిక కీలకం కానుందని పోలీసులు అంటున్నారు. అయితే దీప్తిని తాను చంపలేదని ఆమె సోదరి చందన తమ్ముడికి ఓ వాయిస్ మెసేజ్ పెంపింది.
Korutla Software Engineer : కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దీప్తి అనుమానాస్పద మృతి సంచలనం రేపుతోంది. ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆమె సోదరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అయితే దీప్తి సోదరి చందన తమ్ముడు సాయికి ఓ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్ లో తన అక్క దీప్తిని తాను చంపలేదని అంటోంది చెల్లెలు చందన. దీప్తి శరీరంపై గాయాలతో పాటు ఆమె ఎడమ చేయి విరిగడంతో హత్య కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరో వైపు తమ్ముడు సాయికి చందన వాయిస్ మెసేజ్ పంపడంతో కేసు మరో మలుపు తిరిగింది.
వాయిస్ మెసేజ్ లో ఇలా?
"అరేయ్ సాయి నేను చందక్కనురా, నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను మందు తాగుదామనుకున్నాం. కానీ నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత మందు తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ అక్కనే మందు తాగింది. తాగిన తర్వాత తన బాయ్ ఫ్రెండును పిలుస్తానని అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నా. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాను. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని అక్కడ నుంచి వెళ్లిపోయాను. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు. నన్ను నమ్ము సాయి, నా తప్పేం లేదు ప్లీజ్ నమ్మురా. మేం రెండు బాటిల్స్ మందు తెప్పించుకున్నాం. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలే" అని చందన వాయిస్ మెసేజ్ పంపింది.
పోస్టుమార్టం రిపోర్టు కీలకం
కోరుట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. దీప్తి మృతదేహానికి కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు వైద్యులు. దీప్తి చేయి, ఛాతి, చెంప భాగంలో గాయాలున్నట్టు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం దీప్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో బుధవారం సాయంత్రం కోరుట్లలో దీప్తి అంత్యక్రియలు నిర్వహించారు. మిస్టరీగా మారిన ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారింది. అయితే ఈ కేసులో కీలకంగా మారిన దీప్తి సోదరి చందన కోసం... పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టు మార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు అంటున్నారు. మెట్ పల్లి డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి మృతి తర్వాత ఇంటి నుంచి వెళ్లి పోయిన ఆమె సోదరి పంపిన ఆడియో వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది?
కోరుట్ల పరిధిలోని భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివశిస్తు్న్నారు. వీరికి దీప్తి(24), చందన, సాయి అనే ముగ్గురు సంతానం ఉన్నారు. దీప్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. చందన బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నారు. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో ఆదివారం శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్ వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు తల్లిదండ్రులు కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం ఫోన్ చేయగా దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. చందన ఫోన్ స్విచ్ఛాప్ వస్తుంది. పక్కింటి వారికి ఫోన్ చేసి విచారించగా.. దీప్తి మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది.