BRS MLA Danam Nagender : కాంగ్రెస్ లోకి దానం నాగేందర్...? ముహుర్తం ఖరారైందా..!-khairatabad brs mla danam nagender meet cm revanth reddy and other congress leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mla Danam Nagender : కాంగ్రెస్ లోకి దానం నాగేందర్...? ముహుర్తం ఖరారైందా..!

BRS MLA Danam Nagender : కాంగ్రెస్ లోకి దానం నాగేందర్...? ముహుర్తం ఖరారైందా..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 15, 2024 02:37 PM IST

BRS MLA Danam Meet CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ భేటీలో ఏఐసీసీ ఇంఛార్జి దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు ఉన్నారు.

కాంగ్రెస్ ముఖ్య నేతలతో దానం నాగేందర్
కాంగ్రెస్ ముఖ్య నేతలతో దానం నాగేందర్

Khairatabad BRS MLA Danam Nagender: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మెజార్టీ సీట్లలో పాగా వేయటమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టేసింది. ఇందులో భాగంగా… ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తుండగా… తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన దానం నాగేందర్(BRS MLA Danam Nagender) కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్న చర్చ జోరందుకుంది.

శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు దానం నాగేందర్(BRS MLA Danam Nagender). ఈ భేటీలో ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే…. దానం కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. అయితే ఎల్లుండి పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం కూడా కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. గతంలో ఆ పార్టీ పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన… మంత్రిగా కూడా పని చేశారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రి అయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన… ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన దానం నాగేందర్….. బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలుపు….

బీఆర్ఎస్ పార్టీలో చేరిన దానం నాగేందర్(Khairatabad BRS MLA Danam Nagender)… 2018 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 28,402 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో కీలకంగా మారారు. ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దానం… మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డిపై 22,010 ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా… బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది.

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. అయితే కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు(Loksabha Elections 2024) సమీపిస్తున్న వేళ…. పార్టీ విజయావకశాలను మరింత మెరుగుపరుచుకునేందుకు పావులు కదిపే పనిలో పడింది. ఇందులో భాగంగా… కీలక నేతలను పార్టీలోకి రప్పిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అధికారికంగా చేరలేదు. మర్యాదపూర్వకంగా మాత్రం… పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవగా… పార్టీ మారుతారనే వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈ వార్తలను కలిసిన ఎమ్మెల్యేలు ఖండించారు. మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని చెప్పుకొచ్చారు. అయితే దానం కూడా అదే తరహా ప్రకటన చేస్తారా…? లేక ఘర్ వాపసీ అంటారా అనేది చూడాలి….!

Whats_app_banner