Mahalakshmi Mahila Sakthi : వచ్చే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం- సీఎం రేవంత్ రెడ్డి
Mahalakshmi Mahila Sakthi : ఆడబిడ్డలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే ఆరు గ్యారెంటీలను(Congress Six Guarantees) తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు అందించే మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారు.
Mahalakshmi Mahila Sakthi : కేసీఆర్, కేటీఆర్, కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Govt) కూలగొట్టాలని అంటున్నారని, నేనంత పాపం ఏం చేశా? మీ అవినీతి సొమ్ములో వాటా అడిగానా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భావోద్వేగంగా మాట్లాడారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో 'మహాలక్ష్మి స్వశక్తి మహిళ' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా వడ్డీ లేకుండా రుణాలను(Interest Free Loan) మహిళలకు అందిస్తున్నామన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి నా నెత్తిన పెట్టి పోయిండన్నారు. ఈ సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానంటూ కేసీఆర్ పదేళ్లు ఆశ చూపి మోసం చేశారని విమర్శించారు. సోనియా గాంధీపై నమ్మకంతో, కాంగ్రెస్‌పై భరోసాతో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పే నేతల్ని మహిళలంతా చీపురు తిరగేసి కొట్టండని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మహిళా సంఘాల కోసం 100 మార్కెట్లు
కట్టెల పొయ్యితో మహిళల కష్టాలను చూసిన సోనియాగాంధీ(Sonia Gandhi).. దీపం పథకం కింద రూ.1500లకే కొత్త గ్యాస్ కనెక్షన్లు అందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.400 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తే కేసీఆర్ కుటుంబానికి కడుపుమంటగా ఉందని ఆరోపించారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వద్దంటూ ఆటో డ్రైవర్లతో ధర్నా చేయించారని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్లపాటు మహిళల పట్టించుకోలేదని, అందుకు వారి ఉసురు తగిలి పదవి పోగొట్టుకున్నారని విమర్శించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. కేసీఆర్, మోదీ కలిసి రూ.400 గ్యాస్ సిలెండర్‌ను రూ.1200 చేశారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ సర్కార్ మహిళలకు గ్యాస్ భారం కావొద్దని రూ.500కే (500 gas cylinder)అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా 100 మార్కెట్లు నిర్మించి, వారి ఉత్పత్తుల విక్రయం కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్, మోదీ కుట్రలు
ముఖ్యమంత్రి స్థానంలో పాలమూరు బిడ్డను చూసి కొందరికి కడుపు మండుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహిళలు గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కేసీఆర్, మోదీ చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి మోసం చేసిన మోదీకి ఎందుకు ఓట్లు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ(PM Modi) ఎన్నోసార్లు అవమానించారన్నారు. పార్లమెంట్ తలుపులు మూసివేసి తెలంగాణ ఇచ్చారని మోదీ చాలాసార్లు అన్నారని గుర్తుచేశారు.
ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలనే ఇందిరమ్మ ఇండ్లు
రాష్ట్రంలోని మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులుని, రానున్న రోజుల్లో కోటి మంది మహిళలు చేరాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కోటి మందిని కోటీశ్వరులను చేస్తే మన రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రగతికి విధాన పత్రం విడుదల చేశారు. లక్ష మంది ఆడబిడ్డలతో సమావేశం ఏర్పాటు చేయాలని 48 గంటల ముందు చెబితే మీరంతా హాజరై మహిళా శక్తిని నిరూపించారు. మీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. నెల రోజుల్లో మహాలక్ష్మిలకు షాపులను ఏర్పాటు చేసి వాటి చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. మీ కష్టాలను చూసే ఆడబిడ్డలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే ఆరు గ్యారెంటీలను(Congress Six Guarantees) తీసుకొచ్చామని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చే గృహజ్యోతి పథకం(Gruhajyothi), ఆరోగ్యశ్రీ(Aarogya Sri) పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Housing), వారి కన్నీళ్లు తుడవాలని రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు సీఎం వివరించారు. వచ్చే ఐదేళ్లలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
సంబంధిత కథనం