MLC Kavitha: ఎర్రవల్లి నివాసానికి కవిత.. కన్న బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్
MLC Kavitha: ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో భావోద్వేగ ఘటన జరిగింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన కవిత.. కేసీఆర్‌ను కలవడానికి ఎర్రవల్లికి వెళ్లారు. తన బిడ్డను చూడగానే మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.
ఇటీవల జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని కలవడానికి ఎర్రవల్లి నివాసానికి వెళ్లారు. భర్త, కుమారుడితో కలిసి వెళ్లిన కవితకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం లభించింది. అక్కడి సిబ్బంది దిష్టి తీసి స్వాగతం పలికారు. కన్న బిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కళ్లల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది. తండ్రి పాదాలకు కవిత నమస్కరించగా.. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు.
ఐదున్నర నెలలు జైలులోనే..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఐదున్నర నెలలు తిహార్ జైలులో ఉన్న కవిత మంగళవారం బెయిల్ మీద విడుదలయ్యారు. ఐదు నెలల తర్వాత హైదరాబాద్ చేరుకున్న కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద కార్యకర్తలకు అభివాదం చేసిన కవిత.. పిడికిలి బిగించి పోరాటాన్ని కొనసాగిస్తానంటూ స్పష్టం చేశారు. జై తెలంగాణ అని నినదించారు. భారీ ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు.
ఇంకా బలంగా పని చేస్తా..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు. 'న్యాయమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. కచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుంది. నిజం నిలకడమీద తెలుస్తుందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నా. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా' అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.
అందరికీ పాదాభివందనాలు..
జైలు నుంచి విడుదలైన తర్వాత.. కవిత కొడుకు, భర్త, అన్నను చూసి కంటతడి పెట్టుకున్నారు. తన పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైల్లో ఉండడం ఇబ్బందికర విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇబ్బందులకు గురిచేసిన వారికి.. తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి తోడుగా ఉన్నవారందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నానని చెప్పారు.