BRS Mlc Kavitha : హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు-brs mlc kavitha reached hyderabad party workers grand welcome to kcr daughter ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mlc Kavitha : హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

BRS Mlc Kavitha : హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

Bandaru Satyaprasad HT Telugu
Aug 28, 2024 10:07 PM IST

BRS Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం దిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమె...భారీ ర్యాలీగా తన నివాసానికి చేరుకున్నారు. కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు
హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

BRS Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం దిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో కవితపై బీఆర్ఎస్ శ్రేణులు పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికాయి. జై తెలంగాణ అంటూ కవిత నినాదాలు చేశారు. దాదాపుగా ఐదు నెలల తర్వాత ఆమె హైదరాబాద్‌కు చేరుకున్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. మంగళవారం రాత్రి ఆమె తీహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.

నివాసానికి చేరుకున్న కవిత

హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత వెంట బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు, కవిత భర్త అనిల్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఉన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారీ ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు కవిత. గురువారం ఎర్రవెల్లిలోని ఫామ్‌ హౌస్‌ లో తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కవిత సమావేశం అవుతారు.

హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కవిత...తాను ఏ తప్పు చేయలేదని, ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. క్షేత్ర స్థాయిలో మరింత పోరాడుతానని కవిత అన్నారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కవిత అన్నారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని తెలిపారు. ఇంటికి చేరుకున్న కవితకు నివాసంలో తల్లి శోభ, కేటీఆర్‌ సతీమణి శైలిమతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కవితను హత్తుకుని ఆమె తల్లి శోభ భావోద్వేగం చెందారు. అనంతరం తన సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టారు.

దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. మార్చి 26న దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అప్పటి నుంచి ఆమె దిల్లీ తిహార్‌ జైలులో ఉన్నారు. మంగళవారం సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్‌ను గ్రాంట్ చేసింది. బెయిల్ కాపీలను తిహార్ జైలు అధికారులకు అందించి మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు కవిత.

సంబంధిత కథనం