Choppadandi Mla Sathyam : శిలాఫలకాలు వద్దు, హంగు ఆర్భాటం వద్దు- చొప్పదండి ఎమ్మెల్యే వినూత్న ఆలోచన-karimnagar choppadandi congress mla medipally sathyam follow new route announced no inaugurated stone ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Choppadandi Mla Sathyam : శిలాఫలకాలు వద్దు, హంగు ఆర్భాటం వద్దు- చొప్పదండి ఎమ్మెల్యే వినూత్న ఆలోచన

Choppadandi Mla Sathyam : శిలాఫలకాలు వద్దు, హంగు ఆర్భాటం వద్దు- చొప్పదండి ఎమ్మెల్యే వినూత్న ఆలోచన

HT Telugu Desk HT Telugu
May 25, 2024 09:19 PM IST

Choppadandi Mla Sathyam : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రజాసేవలో వినూత్న ఆలోచన చేశారు. రూ.10 లక్షల లోపు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు, హంగు ఆర్భాటాలు వద్దని సూచించారు.

శిలాఫలకాలు వద్దు, హంగు ఆర్భాటం వద్దు- చొప్పదండి ఎమ్మెల్యే వినూత్న ఆలోచన
శిలాఫలకాలు వద్దు, హంగు ఆర్భాటం వద్దు- చొప్పదండి ఎమ్మెల్యే వినూత్న ఆలోచన

Choppadandi Mla Sathyam : కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినూత్న ఆలోచన చేశారు. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటు ఖర్చు తగ్గించి, పేదలకు అండగా నిలిచే నిర్ణయం తీసుకున్నారు. నాడు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నేడు ఎమ్మెల్యేగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చిన్న చిన్న పనులకు మంజూరు అయ్యే నిధులే అంతంత మాత్రమే అంటే శిలాఫలకాల పేరిట అదనపు భారం వేయడం సరికాదని నిర్ణయించుకున్నారు. ప్రచారం లేకుండానే సాదాసీదాగా తన నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మేడిపల్లి సత్యం తీసుకున్న నిర్ణయం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభం కోసం శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపనలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని అధికారులకు సూచించారు. రూ.10 లక్షల లోపు పనులకు శంకుస్థాపన శిలాఫలకం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆదేశించారు. నిధులు మంజూరయ్యాయంటే చాలు అందుకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేసి చకాచకా పనులు పూర్తి చేయాలని, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. చొప్పదండి నియోజకవర్గంలో వీఐపీ రాకకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసే అవసరం లేకుండా చేసేశారు. ఇప్పటి వరకు 15 పనులను శంకుస్థాపన శిలాఫలకాలు లేకుండానే పనులు ప్రారంభింపజేశారు అధికారులు.

వృథా ఖర్చు... పేదల కోసం వెచ్చిద్దాం

శంకుస్థాపన శిలాఫలకాల కోసం వృథా ఖర్చు చేయడం తప్ప ఒరిగేదేమీ లేదంటున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన వారంతా టెంకాయలు కొట్టడంతో పాటు ఇతరాత్ర ఏర్పాట్లు చేయడం వల్ల ఆర్థిక భారం పడుతుంది. పనులు చేశామని ప్రజలకు వివరించేందుకు మాత్రమే ఉపయోగపడే ఈ శిలాఫలకాలను తక్కువ నిధులు వెచ్చించిన చోట ఏర్పాటు చేయడం వల్ల ఆ ఖర్చు భారం ఆ పని నిర్మాణంపై పడుతోంది. అయితే పేద విద్యార్థులు, వికలాంగులను ఆదుకునేందుకు ఈ డబ్బును వెచ్చించినట్టయితే వారికి భరోసానిచ్చే అవకాశం ఉంటుందని భావించానని తెలిపారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే శిలాఫలకాలు వేస్తూ ఆర్భాటాలు చేయడం కంటే నియోజకవర్గ ప్రజల సౌకర్యాలను మెరుగుపర్చడం అత్యున్నతమైనదని అనుకున్నానని చెప్పారు. అందుకోసం తక్కువ నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపనల కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు.

నాడు పోరాటం...నేడు ప్రజాసేవ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు విద్యార్థి జేఏసీ నాయకుడిగా... నేడు ఎమ్మెల్యేగా ప్రజా సేవలో మేడిపల్లి సత్యం తరిస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా క్షేత్ర స్థాయి సమస్యలేంటో గమనించిన ఆయన, చట్ట సభకు ఎన్నిక కాగానే వైవిధ్యమైన నిర్ణయాలతో ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. వివిధ పథకాల కింద ప్రభుత్వం మంజూరు చేసే పనులను హంగు ఆర్భాటం లేకుండా చేపడుతు పేదలకు అండగా నిలుస్తూ తన ఔదార్యం చాటుకుంటున్నారు. అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యకు దూరమయ్యే విద్యార్థులకు చేయుత ఇస్తున్నారు. పదోతరగతి పరీక్షల ముందు ఆ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం అల్పాహారం సౌకర్యం ఏర్పాటు చేయాలని తన మొదటి నెల గౌరవ వేతనం లక్షా 50 వేల రూపాయలు కలెక్టర్ కు అందజేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు కావాల్సిన ఆర్థిక సహాయం అందించారు. హంగు ఆర్భాటాలకు వ్యతిరేకంగా పేదలకు అండగా ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే పనులు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. నాడు విద్యార్థి జేఏసీ ఉద్యమ నాయకుడిగా నేడు ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో తన మార్కు పరిపాలనను సాగిస్తున్నారు. మేడిపల్లి సత్యం చేపట్టే కార్యక్రమాలు... నిర్ణయాలు ఆదర్శంగా నిలుస్తుండడంతో పలువురు అభినందిస్తున్నారు.

HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి

టీ20 వరల్డ్ కప్ 2024