Telangana Song : తెలంగాణ గీతాన్ని మన స్వరం, సంగీతంలోనే వినిపిద్దాం- పక్క రాష్ట్రాల వాళ్లతో వద్దు : తెలంగాణ సంగీతకారులు-hyderabad tcma wrote letter to cm revanth reddy on telangana song demands singing with locals ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Song : తెలంగాణ గీతాన్ని మన స్వరం, సంగీతంలోనే వినిపిద్దాం- పక్క రాష్ట్రాల వాళ్లతో వద్దు : తెలంగాణ సంగీతకారులు

Telangana Song : తెలంగాణ గీతాన్ని మన స్వరం, సంగీతంలోనే వినిపిద్దాం- పక్క రాష్ట్రాల వాళ్లతో వద్దు : తెలంగాణ సంగీతకారులు

Bandaru Satyaprasad HT Telugu
May 25, 2024 09:02 PM IST

Telangana State Song : తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ' కు ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ విషయంపై తెలంగాణ సినీ సంగీతకారులు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ పాటకు తెలంగాణ వాళ్లతో సంగీతం, స్వరం అందించాలని కోరారు.

తెలంగాణ గీతాన్ని మన స్వరం, సంగీతంలోనే వినిపిద్దాం
తెలంగాణ గీతాన్ని మన స్వరం, సంగీతంలోనే వినిపిద్దాం

Telangana State Song : తెలంగాణ రాష్ట్ర గీతంగా అందె శ్రీ రచించిన 'జయజయహే తెలంగాణ' పాటను ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. మన రాష్ట్ర గీతాన్ని వేరే వాళ్లతో పాడించడం, సంగీతం కూర్చడసం సరికాదని అభిప్రాయపడింది. లేఖలో విషయం ఇలా....

"అందెశ్రీ రచించిన గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు ప్రకటించి విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా తెలంగాణ సినీ మ్యూజిషియస్ అసోసియేషన్ (TCMA) కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇది. పదేళ్ల క్రితమే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే ఎంతో బాగుండేది. అలా జరగకపోవడం దురదృష్టకరం. గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైయ్యింది. అలాంటి పాటని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయింది. మళ్లీ మీ వల్ల పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. ఈ పాటని బతికిస్తున్నందుకు ధన్యవాదాలు. అన్నీ బాగానే ఉన్నా ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకులు కీరవాణి సంగీతాన్ని అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని మీకు తెలియస్తున్నాము."

"తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్లు పాడటమేంటి, అలాగే పక్క రాష్ట్రాల వాళ్లు ఆ పాటకి సంగీతాన్ని అందించడమేంటి అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఇది మీరు గ్రహిస్తారని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) కళాకారులుగా కోరుతున్నాము. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణలో ఉన్నారు. మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృంద గానంగా పాడించి విడుదల చేస్తే... 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ' అనే గీతంలా గౌరవం దక్కుతుందని మా అభిప్రాయం" అని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది.

Whats_app_banner