Karimnagar Silver Filigree : అంబానీ కుటుంబానికి నచ్చిన 'సిల్వర్ ఫిలిగ్రీ కళ' - పెళ్లికి కరీంనగర్ నుంచే ప్రత్యేక బహుమతుల
Karimnagar Silver Filigree : అనంత్ అంబానీ- రాధికా పెళ్లికి కరీంనగర్ నుంచి ప్రత్యేక బహుమతులు వెళ్లనున్నాయి. పెళ్లి వేడుకకు హాజరయ్యే వారికి అందజేసేందుకు 400కు పైగా గిఫ్ట్ ఆర్టికల్స్ ను అంబానీ కుటుంబం ఆర్డర్ ఇవ్వటం విశేషంగా మారింది.
Karimnagar Silver Filigree : దేశంలోనే అత్యంత అరుదైన కళ సిల్వర్ ఫిలిగ్రీకి ఆదరణ పెరిగింది. ప్రపంచానికి తమ ప్రతిభను చాటి చెబుతున్నారు కరీంనగర్ కళాకారులు. నగిషీలు వెండితో కళాత్మకత ఉట్టిపడేలా గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు.
తాజాగా ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మ్యారేజ్(Anant Ambani Wedding Date) కి గిఫ్ట్ ఆర్టికల్స్ ఆర్డర్ కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు లభించింది. వెండితో విభిన్న ఆకృతుల్లో 400కు పైగా గిఫ్ట్ ఆర్టికల్స్ కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి. వృత్తి నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ దేశానికే వన్నె తీసుకొస్తున్నారు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు.
కుబేరుడి కుటుంబానికి నచ్చిన కరీంనగర్ కళ…
కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ గురించి అంబానీ ఫ్యామిలీ వినడంతో ఏడాదిన్నర కాలంగా సిఫ్కో ప్రతినిధుల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబాని మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుండి కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న సిల్వర్ పిలిగ్రీ కళాకృతుల నమూనాలు పంపిస్తున్నామని సిఫ్కో ప్రతినిధి అశోక్, వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ ప్రోగ్రాం అయినప్పటి నుంచి అంబానీ ఫ్యామిలీకి వివిధ మోడల్స్ పంపించామని వివరించారు. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎంచుకున్న కళాకృతులను తయారు చేసి వారికి పంపిస్తున్నామని వివరించారు.
సిల్వర్ ఫిలిగ్రీ కళపై ప్రముఖుల దృష్టి పడడంతో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. సిల్వర్ ఫిలిగ్రీ కళకు డిమాండ్ పెరుగుతుండడంతో కళాకారుల కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తుండగా కరీంనగర్ ఖ్యాతి ఖండంతరాలకు పాకుతోంది.
జీ20 సదస్సుతో గుర్తింపు….
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ ఉందన్న విషయం తెలిసినప్పటికీ అనుకున్నంత మార్కెటింగ్ మాత్రం లేదు. కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ఫిలిగ్రీ కళ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం జీవం పోసినట్టయింది.
జీ 20 దేశాల సమావేశం భారత్ లో నిర్వహించినప్పుడు వివిధ దేశాల నుండి ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోటుపై కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసిపోయింది. కోణార్క్ సూర్యదేవాలయంలో ఏర్పాటు చేసిన కాలచక్రం పోలిన బ్యాడ్జెస్ తయారు చేయించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆశించినరీతిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. జీ 20 దేశాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లో కరీంనగర్ ఫిలిగ్రీకి కళాకారులకు కూడా అవకాశం లభించింది.
30 మందితో ప్రారంభమై…
కరీంనగర్ అనగానే దశాబ్దాలుగా ఈ కళతో అనుబంధం పెనవేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారులు తమలోని కళకు జీవం పోస్తూ వచ్చారు. కళాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తున్న కళాకృతులను ఆదరించే వారు అంతంత మాత్రమే ఉన్నా ఆర్టిస్టులు మాత్రం వెనకడుగు వేయలేదు.
2008లో ఏర్పాటైన సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సొసైటీ మొదట్లో వెండితో తయరు చేస్తున్న వివిధ రకాల కళాకృతులను మార్కెటింగ్ చేయడం కోసం ఎదురీదారనే చెప్పాలి. ఇంతకాలం కళను నమ్ముకుంటే కుటుంబ పోషణ కూడా భారం అవుతుందన్న ఆందోళనతో కాలం వెల్లదీసిన ఆ కళాకారులకు పదేళ్ళుగా గుర్తింపు రావడం మొదలైంది.
దేశవిదేశాల్లో అత్యంత అరుదైన సిల్వర్ ఫిలిగ్రీకి భవిష్యత్తులో అయినా ఆదరణ లభిస్తుందని ఆశించిన వారి అంచనాలకు తగ్గట్లుగా ఆర్డర్డు వస్తున్నాయి. దేశంలోని ప్రముఖలతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ కూతురు ఇవాంక కు హైదరాబాద్ కు వచ్చినప్పుడు కరీంనగర్ ఫిలిగ్రీ కళా ఖండాలను చూసి మురిసిపోయారు. ప్రముఖులకు గిఫ్ట్ ఆర్టికల్ గా కళాకృతులు ప్రధానం చేయబడ్డాయి. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు గుర్తింపు లభించింది.
ఇక అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలనే అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇక పెళ్లి ఏ రేంజ్‌లో చేయనున్నారన్నది అందరూ రకరకాలుగా ఊహించుకుంటున్నారు.
రిపోర్టింగ్ - HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి
సంబంధిత కథనం