Ugadi Puraskar: చెన్నైలో సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు.. ఆ సినిమాలకే అవార్డులు-silver jubilee ugadi puraskar award at chennai on april 7 sri kalasudha telugu association ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ugadi Puraskar: చెన్నైలో సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు.. ఆ సినిమాలకే అవార్డులు

Ugadi Puraskar: చెన్నైలో సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు.. ఆ సినిమాలకే అవార్డులు

Sanjiv Kumar HT Telugu
Apr 05, 2024 12:29 PM IST

Silver Jubilee Ugadi Puraskar At Chennai: తెలుగుదనం ఉట్టి పడేలా చెన్నైలో సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ కమిటీ మెంబర్స్ తెలిపారు. సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నైలో సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు.. ఆ సినిమాలకే అవార్డులు
చెన్నైలో సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు.. ఆ సినిమాలకే అవార్డులు

Silver Jubilee Ugadi Puraskar Awards: ప్రతి ఏడాది ఉగాది పురస్కారాలు అందిస్తూ చెన్నైలో తెలుగు వారి కీర్తిని చాటుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఈ ఏడాది సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాలు అందించబోతోంది. ఈ సంస్థ స్థాపించి పాతికేళ్ల అవుతుంది. ఈ నెల 7వ తేదీన చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ వివరించారు.

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "చెన్నై మహానగరంలో తెలుగు వారి ఘన కీర్తిని చాటుతూ పాతిక సంవత్సరాలుగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు అందిస్తున్నాం. 1998, నవంబర్ 21వ తేదీన ఈ అవార్డ్స్ ప్రారంభించాం. శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ స్థాపించి ఇరవై ఐదేళ్లు పూర్తయింది. ఉగాదికి రెండు రోజుల ముందే ఈ నెల 7వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి చెన్నై మ్యూజిక్ అకాడెమీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ సందర్భంగా సావనీర్ రిలీజ్ చేయబోతున్నాం" అని తెలిపారు.

"క్రోధి నామ సంవత్సరం ఉగాది రోజున మహిళా రత్న పురస్కారం, ఒక నటి, దర్శకుడికి బాపు రమణ పేరు మీద బాపు బొమ్మ అవార్డ్ ఇస్తున్నాం. అలాగే నిర్మాత ఆదిత్య రామ్ గారికి విశిష్ట ఉగాది పురస్కారం, రవి ప్రసాద్ యూనిట్ అధినేత చంగయ్య గారికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వబోతున్నాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజైన తెలుగు సినిమాల్లో మన తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న చిత్రాలకు పురస్కారాలు ఇస్తాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు అతిథిగా పాల్గొంటారు. సభాధ్యక్షుడిగా మండలి బుద్ధ ప్రసాద్ గారు వ్యవహరిస్తారు" అని బేతిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.

"శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్‌లో నేను కమిటీ మెంబర్‌గా పదేళ్లుగా కొనసాగుతున్నాను. ప్రతి ఏడాది ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇలా పాతికేళ్లుగా ఈ ఉగాది పురస్కారాలు ఇస్తున్న శ్రీనివాస్ గారు, ఇతర కమిటీ మెంబర్స్ కు అభినందనలు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో ఈ పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ వేదిక మీద అవార్డ్ అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తుంటారు" అని కమిటీ మెంబర్ పర్వతనేని రాంబాబు అన్నారు.

"శ్రీనివాస్ గారు ఏడాది అంతా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో తెలుగు సినిమాలను అక్కడ ఉన్న తెలుగు వారికీ చూపిస్తూ వాటిలో బాగున్న వాటిని అవార్డ్స్ కోసం సెలెక్ట్ చేస్తుంటారు. ఈ సారి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చిన ప్రతి కుటుంబానికి సిల్వర్ కాయిన్ రిటన్ గిఫ్టుగా ఇస్తున్నారు. ప్రసన్నకుమార్ గారు ఈ కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరంతా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నా" అని రాంబాబు చెప్పారు.

"శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ చెన్నై సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మండలి బుద్ధ ప్రసాద్ గారు, గానకోకిల సుశీల గారు, ఎస్ బీఐ చెన్నై సర్కిల్ జీఎం ఎంవీఆర్ మురళీకృష్ణ గారు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరవుతారు" అని కమిటీ మెంబర్ సౌజన్య పేర్కొన్నారు.

IPL_Entry_Point