Cash Seize in Sangareddy: సంగారెడ్డి, వికారాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం
Cash Seize in Sangareddy: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.12లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Cash Seize in Sangareddy: సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పోలీసుల నిర్వహించిన తనిఖీలలో రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పొరుగునే ఉన్న, వికారాబాద్ జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్ళే జాతీయ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి డిఎస్పీ రవి కుమార్ నాయకత్వంలో చేపట్టిన తనిఖీలలో, సంగారెడ్డి రూరల్ పోలీసులు ఒక వ్యక్తి తన కారులో తగిన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలు సోమవారం అర్ధరాత్రి మొదలుకొని, మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి.
వికారాబాద్ జిల్లాలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మోమిన్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో, సరైన పేపర్లు లేకుండా తీసుకెళ్తున్న రూ 5 లక్షలు డబ్బులను మరొక వ్యక్తి నుండి పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, పోలీసులు తనిఖీలు చేపట్టారు.
రద్దీగా ఉండే రోడ్లయినా ముంబై-హైదరాబాద్, నాందేడ్-అకోలా-సంగారెడ్డి, రాజీవ్ రహదారి, ఇతర ప్రధాన రహదారులపైనా పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు చూపిస్తే ఎన్నికల అధికారులు ఆ డబ్బును తిరిగి ఆ వ్యక్తులకు ఇస్తారని తెలిపారు.
తుపాకులను స్వాధీన పర్చాలి.. సిద్దిపేట కమీషనర్ శ్వేత
ఎన్నికలు కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో, పోలిసులు కఠినంగా వ్యవరించాలని సిద్దిపేట పోలీస్ కమీషనర్ ఎన్.శ్వేత పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 28 లైసెన్స్డ్ తుపాకులను అక్టోబర్ 16 లోపు , ఆయా పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన, తర్వాత వారి ఆయుధాల్ని తిరిగి ఆయా వ్యక్తులకు ఇస్తామని చెప్పారు. జిల్లా మొత్తం సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సిద్దిపేట పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు.
మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నియామవళిని నిష్పక్షపాతంగా అమలు చేస్తామని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, పటిష్ట నిఘా పెట్టాలన్నారు. మద్యం, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.