Osmania Hospital : చిన్నారి ప్రాణం నిలబెట్టిన ఉస్మానియా, తల్లి కాలేయాన్ని కుమారుడికి అమర్చిన వైద్యులు-hyderabad osmania govt hospital doctors successfully conducted liver transplant operation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Osmania Hospital : చిన్నారి ప్రాణం నిలబెట్టిన ఉస్మానియా, తల్లి కాలేయాన్ని కుమారుడికి అమర్చిన వైద్యులు

Osmania Hospital : చిన్నారి ప్రాణం నిలబెట్టిన ఉస్మానియా, తల్లి కాలేయాన్ని కుమారుడికి అమర్చిన వైద్యులు

Osmania Hospital : ఉస్మానియా వైద్యులు కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తల్లి కాలేయాన్ని కుమారుడికి అమర్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయని వైద్యులు అంటున్నారు.

చిన్నారి ప్రాణం నిలబెట్టిన ఉస్మానియా, తల్లి కాలేయాన్ని కుమారుడికి అమర్చిన వైద్యులు

Osmania Hospital : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవ‌లు అందుతున్నాయని, అందుకు ఈ సంఘటనలే నిదర్శనమని వైద్యులు అంటున్నారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిది మంది చిన్నారుల‌తో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజ‌యవంతంగా పూర్తి చేశారు. తాజాగా మ‌రో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజ‌య‌వంత‌మైంది. ఖ‌మ్మం జిల్లా కొణిజ‌ర్ల మండ‌లం కొండ‌వ‌న‌మాల గ్రామానికి చెందిన మోదుగు గుణ‌శేఖ‌ర్‌, అమ‌ల దంప‌తుల కుమారుడు మాస్టర్ చోహ‌న్ ఆదిత్య (3 ఏళ్లు) పుట్టుక‌తోనే పిత్తాశ‌య ధ‌మ‌ని, కాలేయ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నాడు. చోహ‌న్ ఆదిత్యను ప‌రిశీలించిన ఉస్మానియా వైద్యులు మ‌ధుసూద‌న్ నేతృత్వంలోని స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జీ, కాలేయ మార్పిడి బృందం ఈ నెల మూడో తేదీన ఆదిత్యకు ఉస్మానియా ఆసుప‌త్రిలో కాలేయ మార్పిడి చికిత్సను విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. చోహ‌న్ ఆదిత్య తల్లి అమ‌ల కాలేయాన్ని త‌న కుమారునికి దానం చేయ‌డంతో కొంత భాగాన్ని తీసుకొని బాలునికి అమ‌ర్చారు. ప్రస్తుతం త‌ల్లీకుమారుడు క్షేమంగా ఉన్నారు. వారిని మంగ‌ళ‌వారం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అగ్రశేణి ఆరోగ్య సేవలు

"ప్రభుత్వ ఆసుపత్రులు కాలేయ మార్పిడి వంటి అగ్రశ్రేణి ఆరోగ్య సేవలను అందజేస్తున్నాయి. అత్యాధునిక ఆరోగ్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల (మండలం) కొండ వనమాల గ్రామానికి చెందిన గుణశేఖర్ కుమారుడు మోదుగు చోహన్ ఆదిత్య పుట్టుకతో పిత్తాశయం, కాలేయ వైఫల్యంతో బాధపడుతున్నాడు. చాలా అధునాతన కాలేయ మార్పిడి ప్రక్రియ జులై 3, 2024న ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్ మధుసూదన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ బృందం విజయవంతంగా నిర్వహించింది. చిన్నారి తల్లి అమల తన కాలేయంలో కొంత భాగాన్ని తన కుమారుడికి దానం చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ బాగా కోలుకుంటున్నారు. నిన్న వారిద్దర్నీ డిశ్చార్జ్ చేశారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో ఇప్పటి వరకు 9 పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కేసులతో సహా 30 కాలేయ మార్పిడి కేసులు విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతో వచ్చే బిలియరీ అట్రేసియా, NISCH సిండ్రోమ్, విల్సన్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఉస్మానియాలో విజయవంతంగా చికిత్స అందిస్తున్నారు" - మంత్రి దామోదర రాజనర్సింహ

సంబంధిత కథనం