Hyderabad To Vijayawada : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఇక తక్కువ టైంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు!
Hyderabad To Vijayawada : హైదరాబాద్- విజయవాడ మధ్య కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. విష్ణుపురం నుంచి మోటుమర్రి వరకు రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్, విజయవాడ ప్రయాణ సమయం తగ్గనుంది.
Hyderabad To Vijayawada : ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి కొత్త రైల్వే ట్రాక్ మొదలుకానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. ఖమ్మం జిల్లా మోటుమర్రి, నల్గొండ జిల్లా విష్ణుపురం మధ్య 88.8 కిలోమీటర్ల రైల్వే డబులింగ్ లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.1,746.40 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ లేన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది.
అతి తక్కువ సమయంలో విజయవాడకు
నల్గొండ జిల్లా విష్ణుపురం నుంచి ఖమ్మం జిల్లా మోటుమర్రి వరకు రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. ప్రస్తుతం విష్ణుపురం, మోటుమర్రి మధ్య గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ మార్గంలో రెండో రైలు మార్గాన్ని నిర్మించి ప్యాసింజర్ రైలును దారి మళ్లించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రయాణికులు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి గుంటూరు వెళ్లి అక్కడి నుంచి విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. సికింద్రాబాద్ నుంచి 313 కిలోమీటర్ల దూరం ఉండగా.... బీబీనగర్- గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండడంతో ప్రయాణికులకు రైలులో ప్రయాణించాలంటే దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం మోటుమర్రి మార్గంలో రెండో లైన్ ఏర్పాటు చేస్తే గుంటూరు వెళ్లకుండా నేరుగా విజయవాడ చేరుకోవచ్చు. దాదాపు 50 కిలోమీటర్ల దూరం తగ్గించి గంట సమయం ఆదా చేసుకునే అవకాశం ఉంది. 2011లో సిమెంట్ పరిశ్రమల వాణిజ్య అవసరాల కోసం విష్ణుపురం నుంచి మోటుమర్రి మార్గం వరకు రైలు మార్గం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 24 గూడ్స్ రైలు తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ గూడ్స్ రైళ్లు సిమెంటు,ఇనుము, బియ్యం రవాణా చేస్తున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
రైల్వే టికెట్ల కొనుగోలు సౌలభ్యం కోసం అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో పీఓఎస్ మెషీన్లు,యూపీఐ ద్వారా చెల్లింపులు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే డిజిటల్ కార్యక్రమంలో ముందంజలో ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా యూటీఎస్ మొబైల్ యాప్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లు,యూపీఐ చెల్లింపులు మొదలైన వాటిని ప్రవేశ పెట్టడం వంటి అనేక చర్యలు చేపట్టింది దక్షిణ మధ్య రైల్వే. ఆన్లైన్ సదుపాయాలను బలోపేతం చేయడానికి రైలు వినియోగదారులు సులభంగా,సౌకర్యవంతంగా టికెట్లు కొనుగోలు చేయడానికి, నగదు రహిత లావాదేవీల డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీని ప్రకారం.... దాదాపు జోన్ లోని అన్ని ముఖ్యమైన నాన్ సబర్బన్ స్టేషన్లలో, సబర్బన్ కేటగిరి స్టేషన్ లోని అన్ని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం, ఆన్ రిజర్వడ్ టికెటింగ్ సిస్టమ్ కౌంటర్లలో పోఓయేస్ మెషీన్ ల చెల్లింపులకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. సాంకేతిక అభివృద్ధి చెందుతున్నందున నగదు రహిత చెల్లింపులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీని ప్రకారం రైలు ప్రయాణికులకు అనుగుణంగా సేవ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సానుకూల ప్రయత్నాలు చేస్తుంది. దక్షిణ మధ్య రైల్వే లో ఈ ప్రయత్నాలు భాగంగా ప్రస్తుతం 466 పీఓఎస్ యంత్రాలు అందుబాటులోకి తెచ్చింది. ఈపీఓఎస్ మిషన్ లో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులను సులభతరం చేస్తాయి. తద్వారా సులభతరమైన సౌకర్యంతమైన లావాదేవులను అందిస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం