TS Traffic Challan : వాహనదారులకు అలర్ట్- చలాన్లపై డిస్కౌంట్ గడువు మరోసారి పెంపు
TS Traffic Challan : ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది, ఫిబ్రవరి 15 వరకు చలాన్లు చెల్లించవచ్చని తెలిపింది.
TS Traffic Challan : వాహనదారుల పెండింగ్ చలాన్ల రాయితీ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రాయితీపై చలాన్లు చెల్లింపును ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిసెంబర్ 25 వరకు పెండింగ్ లో చలాన్లకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా, వీటిల్లో 40 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ చలాన్లతో ప్రభుత్వానికి రూ.135 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని తెలుస్తోంది.
మరోసారి పొడిగింపు
గత ఏడాది డిసెంబర్ 27వ పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది ప్రభుత్వం. టూ, త్రీ వీలర్స్ వాహనాలపై 80 శాతం, లైట్, హెవీ మోటార్ వెహికల్స్ పై 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీ ప్రకటించింది. జనవరి 10 వరకు చలాన్ల చెల్లింపునకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 31 వరకు గడువు పొడిగించింది. నేటితో గడువు ముగియడంతో మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చలాన్లపై రాయితీ
హైదరాబాద్ నగరంలోని రాచకొండ,హైదరాబాద్,సైబరాబాద్.... మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్ లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు అన్నీ పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు చలాన్లను విధిస్తారు. సీసీ కెమెరాల ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా కొందరి నుంచి చలాన్లను వసూలు చేస్తున్న చాలా మంది మాత్రం చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఇటీవల కాలంలో పెండింగ్ చలాన్లు పెద్ద సంఖ్యలో చెల్లించకుండా ఉండటంతో పెండింగ్ చలాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కొవిడ్ కారణంగా వెహికల్స్ ఓనర్స్ పెండింగ్ చలాన్లు చెల్లించలేకపోయారు. కొన్ని వెహికల్స్ పై వాటి వ్యాల్యూ కంటే ఎక్కువ మొత్తంలో చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించింది.
వరంగల్ కమిషనరేట్ లో
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ట్రాఫిక్ చాలాన్లు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించింది. కాగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో కలిపి దాదాపు 20 లక్షలకుపైగా చాలాన్లు పెండింగ్ లో ఉండగా.. రూ.50 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వరంగల్ పోలీసులు చలాన్లు క్లియర్ చేయించేందుకు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. కొంతమంది రాయితీలు వినియోగించుకునేందుకు సొంతంగా చెల్లింపులు కూడా చేశారు. మీ సేవ, ఆన్ లైన్ ఈ-చలాన్, పేటీఎం తదితర సేవలు వినియోగించుకున్నారు. ఇలా డిసెంబర్ 26 నుంచి సంక్రాంతి పండుగ వరకు సుమారు 8 లక్షల చలాన్ల వరకు క్లియర్ కాగా.. మొత్తంగా రూ.20.31 కోట్లకుపైగా వసూలు అయ్యాయి. కేవలం 20 రోజుల్లోనే ఇంత పెద్దఎత్తున చాలాన్లు వసూలు కావడం ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు.
సంబంధిత కథనం