Challans | పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్.. ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్!
చలాన్‌లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. వారి వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు సులభంగా చెల్లించేందు కోసం భారీ డిస్కౌంట్లను ప్రకటించారు.
Hyderabad | వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి చలాన్‌లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. వారి వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు సులభంగా చెల్లించేందు కోసం భారీ డిస్కౌంట్లను ప్రకటించారు.
COVID-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున మానవతా దృక్పథంతో ఈ వన్-టైమ్ డిస్కౌంట్ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసు విభాగం బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నవారిలో దాదాపు 85 శాతం దిచక్ర వాహనాలు, ఆటోలు నడిపే సామాన్య, మధ్యతరగతి ప్రజలే ఉన్నారని ప్రకటనలో వెల్లడించారు.
ప్రతిపాదించిన రాయితీలు ఈ రకంగా ఉన్నాయి:
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 25% చలాన్ చెల్లిస్తే మిగిలిన 75% పెండింగ్ చలాన్‌లు మాఫీ అవుతాయి. తోపుడు బండ్లు, ఇతర కార్ట్ వాహనాలను ఉపయోగించే చిరు వ్యాపారులు 20% చెల్లిస్తే, మిగిలిన 80% మాఫీ అవుతుంది.
ఇదే క్రమంలో తేలికపాటి మోటారు వాహనాలు (LMVలు), కార్లు, జీపులు, అలాగే భారీ వాహనాలకైతే మొత్తం చలాన్లలో సగం చెల్లించాలి, మిగతా సగం మాఫీ. ఇక చివరగా, ఆర్టీసీ డ్రైవర్లు 30% చెల్లిస్తే, మిగిలిన 70% మాఫీ అవుతుంది.
ఈ చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో లేదా మీసేవా మాత్రమే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సదుపాయం మార్చి 1 నుంచి మార్చి 31 మధ్య ఉపయోగించుకోవచ్చునని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. సెలవులో ఉన్న డీజీపీ మహేంధర్ రెడ్డి తిరిగి రాగానే ఆయన ఆమోదం పొందిన తర్వాత ఈ డిస్కౌంట్స్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు దాదాపుగా రూ. 600 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.
సంబంధిత కథనం