TS BJP First List : తెలంగాణ బీజేపీలో తొలి జాబితా చిచ్చు, కీలక నేతలు అసంతృప్తి!-hyderabad news in telugu ts key leaders not happy with bjp first list ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Bjp First List : తెలంగాణ బీజేపీలో తొలి జాబితా చిచ్చు, కీలక నేతలు అసంతృప్తి!

TS BJP First List : తెలంగాణ బీజేపీలో తొలి జాబితా చిచ్చు, కీలక నేతలు అసంతృప్తి!

HT Telugu Desk HT Telugu
Mar 03, 2024 06:35 PM IST

TS BJP First List : బీజేపీ తొలి జాబితాపై తెలంగాణ కాషాయ నేతలు గుర్రుగా ఉన్నారు. టికెట్ తమకే ఖరారు అని భావించిన నేతలకు తొలి జాబితాలో నిరాశ ఎదురైంది. దీంతో కొందరు నేతలు రెండో జాబితా కోసం ఎదురుచూస్తుంటే... మరికొంత మంది భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారు.

తెలంగాణ బీజేపీలో తొలి జాబితా చిచ్చు
తెలంగాణ బీజేపీలో తొలి జాబితా చిచ్చు

TS BJP First List : రానున్న లోక్ సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా(BJP First List) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 మందికి సీట్లు కేటాయించారు. అయితే తొలిజాబితాపై తెలంగాణలో అసమ్మతి రాజుకుంటుంది. తొమ్మిది మంది జాబితాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం దక్కగా......నలుగురు కొత్తవారికి అధిష్టానం చోటు కల్పించింది. నాగర్ కర్నూలు, మల్కాజ్ గిరి, జహీరాబాద్, హైదరాబాద్ స్థానాల్లో పార్టీ కీలక నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతుంది. హైదరాబాద్(Hyderabad) పార్లమెంట్ స్థానం ఆశించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించడానికి మీకు మొగోడే దొరకలేదా అంటూ ఎద్దేవా వేశారు. ఇప్పటికీ బీజేపీలో చేరని మాధవి లతకు హైదరాబాద్ సీటు కేటాయించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ ఫ్లోర్ లీడర్ అవకాశం కూడా దక్కకపోవడంతో... విజయ సంకల్ప యాత్రతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అసంతృప్తిలో బీజేపీ నేతలు

మరోవైపు మల్కాజ్ గిరి (Malkajgiri)ఎంపీ టికెట్ ఆశించిన పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లే తెలుస్తుంది. త్వరలో ఆయన తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానంటూ సంచలన ట్విట్ చేశారు.అయితే గత కొన్నాళ్లుగా మురళీధర్ రావు మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టి తనకే టికెట్ దక్కుతుందని ఆశతో ఉండగా...హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) కు బీజేపీ అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ కేటాయిస్తూ శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ గెలుపునకు మురళీధర్ రావు సహాకరిస్తారా? లేక మరో పార్టీలోకి వెళ్తారా? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఈయనతో పాటు దిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత ఎం.కొమురయ్య, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్ళ వీరేందర్ గౌడ్ సైతం మల్కాజ్ గిరి సీటు ఆశించారు. టికెట్ ఈటలకి దక్కడంతో భంగపడిన నేతలంతా గెలుపు కోసం కృషి చేస్తారా? లేదా అని సస్పెన్స్ గా మారింది.

రెండో జాబితాలో టికెట్ రాకుంటే నా దారి నేను చూసుకుంటా - సోయం బాపూరావు

ఇదిలా ఉంటే మరోవైపు నాగర్ కర్నూల్(Nagar Kurnool) ఎంపీ టికెట్ ఆశించిన బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి కూడా బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు భరత్ కుమార్ కు నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించడంతో బంగారు శృతి నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బీబీ పాటిల్(BB Patil) కు టికెట్ ఇవ్వగా.....ఆ స్థానంపై ఆశలు పెట్టుకున్న ఆలే నరేంద్ర కుమారుడు ఆలే భాస్కర్, మాజీ మంత్రి బాగా రెడ్డి కుమారుడు జయపాల్ రెడ్డి తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇటు మొదటి జాబితాలో తమ పేర్లు రాకపోవడంతో మహబూబ్ నగర్ టికెట్ ఆశించిన డీకే అరుణ(DK Aruna), మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం ఆందోళనలో ఉన్నారట. ఇకపోతే ఆదిలాబాద్(Adilabad) స్థానంపై బీజేపీ అధిష్ఠానం తొలి జాబితాలో ఎవరి పేరు ప్రకటించుకోవడంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు(Soyam Bapuram) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని, ఆదివాసీ బిడ్డ రెండోసారి గెలిస్తే ఎక్కడ కేంద్రమంత్రి అవుతాడో అని భయంతో తనకు టిక్కెట్ రాకుండా కొందరు బీజేపీ తెలంగాణ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. తాను కొమ్మపై ఆధారపడ్డొడిని కాదని స్వతహాగా ఎదిగిన వ్యక్తిని అని అన్నారు. రెండో జాబితాలో టిక్కెట్ వస్తుందని తాను భావిస్తున్నట్లు ఒకవేళ రాకపోతే తన దారి తాను చూసుకుంటా అని అన్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

సంబంధిత కథనం