TS Group 2 Exam : తెలంగాణ గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదా, టీఎస్పీఎస్సీ ప్రకటన
TS Group 2 Exam : తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు జరగలేదు. దీంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
TS Group 2 Exam : తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరిగాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాతో గ్రూప్-2 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు జరగలేదు. దీంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే కొత్త తేదీలను వెల్లడిస్తామని తెలిపింది.
783 పోస్టులు
మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. వరుసగా గ్రూప్-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది టీఎస్పీఎస్సీ. అయితే నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది టీఎస్పీఎస్సీ.
కొత్త ఛైర్మన్ ఎంపిక
ఇంతలోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో… పేపర్ లీక్ కేసుపై దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని భావించిన సర్కార్... ఛైర్మన్ తో పాటు సభ్యులను రాజీనామా చేసే దిశగా చర్యలు తీసుకుంది. సర్కార్ ప్రయత్నాల నేపథ్యంలో… టీఎస్పీఎస్సీలోని సభ్యులు కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఛైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులు ఎంపిక కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వారి పేర్లను ఖరారు చేసి గవర్నర్ కు పంపాల్సి ఉంటుంది. వీరి నియమకాలకు రాష్ట్రపతి ఆమోదం కూడా తప్పనిసరి. దీంతో ఈ ప్రక్రియంతా పూర్తి కావటానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమని భావించిన బోర్డు మరోసారి వాయిదా వేసింది. కొత్త ఛైర్మన్ , సభ్యుల ఎంపిక తర్వాతే గ్రూప్ 2 నిర్వహణపై స్పష్టత రానుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పరీక్షను రీషెడ్యూల్ చేశారు.