TS SIX Guarantees : ఆరు గ్యారంటీలు అమలు ఎలా? దరఖాస్తుపై అనేక సందేహాలు- రేషన్ కార్డు లేకపోతే పరిస్థితేంటి?
TS SIX Guarantees : ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డే అర్హత అంటున్నారు మంత్రులు. అర్హులైన చాలా మందికి రేషన్ కార్డులు లేవు. వారి పరిస్థితి ఏంటి? కొత్త రేషన్ కార్డుల మాటేంటి? రేషన్ కార్డు లేకుండా దరఖాస్తులు తీసుకుంటారా? ఇలా ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
TS SIX Guarantees : ఆరు గ్యారంటీలతో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్. రానున్న వంద రోజుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, యువవికాసం, ఇందిమ్మ ఇండ్లు అనే ఆరు గ్యారంటీలు అమలుచేస్తామని అధికార పార్టీ నేతలు అంటున్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలకు 'ప్రజాపాలన' కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే వీటిపై ప్రజల్లో కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
రేషన్ కార్డులేని అర్హుల మాటేంటి?
గ్యారంటీల దరఖాస్తుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు అంటున్నారు. తెలంగాణలో గత ఏడేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ అవ్వలేదు. రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన చాలా మందికి రేషన్ కార్డులు లేవు. ఇలాంటి వారికి ఎలా అవకాశం కల్పిస్తారని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ అనంతరం గ్యారంటీలకు లబ్దిదారులను ఎంపిక చేయాలని కోరుతున్నారు. లబ్దిదారుల సంఖ్య తగ్గించుకునేందుకే రేషన్ కార్డు అర్హత పెట్టారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఉపాధి కోసం పట్టణాలకు వచ్చిన వారి ఆధార్ అడ్రస్ లు గ్రామాలవే ఉన్నాయి. ఈ తరుణంలో పట్టణాల్లో సంక్షేమ పథకాలకు వారిని అర్హులుగా పరిగణిస్తారా? లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీపై సందేహాలు
ఆరు గ్యారంటీలకు ఆకర్షితులైన ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలపై దృష్టి పెట్టింది. వీటిలో రెండు గ్యారంటీలను అమల్లోకి తెచ్చింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. మిగిలిన హామీలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఈ గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డు అర్హతగా నిర్ణయించింది ప్రభుత్వం. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్న చాలా మంది అర్హులకు రేషన్ కార్డులు లేవు. కొత్త రేషన్ కార్డుల జారీపై స్పష్టత లేకపోవడంతో తమని గ్యారంటీలకు అర్హులుగా పరిగణిస్తారా? లేదా? అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతుంది.
దిల్లీ తరహాలో అమలు చేస్తారా?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించింది. ఈ గ్యారంటీ అమలుకు రేషన్ కార్డు అర్హత పెడతారా? అనే సందేహం ప్రజల్లో ఉంది. దిల్లీ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలుచేస్తుంది. అక్కడ రేషన్ కార్డు అర్హత లేకుండా ఎవరైనా సరే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు. తెలంగాణలో కూడా ఇదే తరహాలో అమలు చేయాలని కోరుతున్నారు. వీటితో పాటు రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయం, రైతు భరోసా కింద రూ.15 వేలు , నిరుద్యోగ భృతి, చేయూత కింద రూ.4 వేల పింఛన్...ఇలా ప్రతి గ్యారంటీపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
లబ్దిదారుల ఎంపికపై స్పష్టత వస్తుందా?
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ, రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి కాస్త క్లారిటీ ఇచ్చినా... అధికారిక నిబంధనలు విడుదల అయ్యే వరకు ఆరు గ్యారంటీలపై ప్రజల్లో స్పష్టం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతీ ఒక్క దరఖాస్తును స్వీకరించమని మంత్రులు అధికారులకు ఆదేశిస్తున్నారు. ముందు దరఖాస్తులు స్వీకరిస్తే.. తర్వాత లబ్దిదారుల ఎంపికపై స్పష్టం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కనీసం దరఖాస్తు తీసుకుంటే... ఎప్పటికైనా లబ్దిచేకూరుతోందని, సంక్షేమ పథకాలు వస్తాయని ప్రజలు భావిస్తున్నారు. రేపటి నుంచి ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు కాబట్టి త్వరలో వీటిలో ఓ స్పష్టత వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
గ్యారంటీల దరఖాస్తుకు కావాల్సినవి ఇవే
గ్యారంటీల దరాఖాస్తు కోసం -దరఖాస్తు దారు ఫొటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ ఏజెన్సీ పేరు, పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, సర్వే సంఖ్య, విస్తీర్ణం, వ్యవసాయ కూలీ అయినే జాబ్ కార్డు నెంబర్, విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్, దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నెంబర్ సిద్ధం చేసుకోవాలి. దరఖాస్తు చేసినప్పుడు ఈ వివరాలు అధికారులకు తెలపాలి.