TS New Govt Formation Live Updates : తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ జారీ, సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా!
TS New Govt Formation Live Updates : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ జారీ అయింది. అయితే సీఎల్పీ నేత ఎంపిక చేయకపోవడంతో సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.
TS New Govt Formation Live Updates : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ జారీచేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ను సీఈవో వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ తమిళిసైకు గెజిట్ అందజేశారు. దీంతో పాటు ఎన్నికల ఫలితాలపై నివేదిక అందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందించారు సీఈవో వికాస్ రాజ్. మంత్రివర్గ సిఫార్సు మేరకు తెలంగాణ రెండో శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు.
07:02 PM
రాజ్ భవన్ లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా
రాజ్ భవన్ లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. జీఏడీ, పోలీస్, ప్రోటోకాల్, ఐ అండ్ పీఆర్ అధికారులు రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే డీకే శివకుమార్ దిల్లీకి బయలుదేరారు. డీకే శివకుమార్ వెంట భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. రేపు ఖర్గేతో అనంతరం సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
06:46 PM
కొత్త సీఎం ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
తెలంగాణ కొత్త సీఎం ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ సీఎం ప్రమాణానికి అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం, మంత్రి వర్గంపై కాంగ్రెస్ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని సమాచారం.
06:44 PM
కొత్త ప్రభుత్వం కోసం సిద్ధమవుతున్న సచివాలయం- నేమ్ బోర్దుల తొలగింపు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. సచివాలయం, అసెంబ్లీలను కొత్త ప్రభుత్వం కోసం సిద్ధం చేస్తున్నారు. సెక్రటేరియట్ లో పాత నేమ్ ప్లేట్లను తొలగించారు. కొత్త మంత్రుల కోసం ఛాంబర్లను సిద్ధం చేస్తున్నారు. సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ సాయంత్రం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9వ తేదీన భారీ స్థాయిలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు.
06.20 PM
ఇవాళ రాత్రి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. రేవంత్ తో పాటు మంత్రులుగా 4గురు ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత మంత్రివర్గంలో ఒక ఎస్సీ(భట్టి విక్రమార్క), ఒక ఎస్టీ (సీతక్క), ఒక మైనారిటీ (అజారుద్దీన్), ఒక బీసీ (పొన్నం ప్రభాకర్) లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మొదటి కేబినెట్ సమావేశంలో తీర్మానించి అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉందని సమాచారం.
06.00 PM
గవర్నర్ ను కలవనున్న కాంగ్రెస్ ప్రతినిధులు
తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ప్రక్రియ ప్రారంభం అయింది. ఎన్నికల సంఘం బృందం గవర్నర్ తమిళి సైను కలవడంతో కాంగ్రెస్ ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలవనున్నారు. కాంగ్రెస్ శాసన సభాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్ తెలియజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. సీఎల్పీ నేత ఎన్నికైన వారికి సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానించనున్నారు. ఇవాళ ఈ ప్రక్రియ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
05.45 PM
కొత్త మంత్రులకు వాహనాలు సిద్ధం
తెలంగాణలో ఇవాళ రాత్రికే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి 8:30 గంటలకు కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే కొత్త మంత్రుల కోసం అధికారులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు దిల్‌కుష అతిథి గృహానికి కొత్త మంత్రుల వాహనాలను తీసుకొచ్చారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుకు తగిన విధంగా సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు పాత బోర్డులను తొలగిస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుల ఆఫీసులను సిబ్బంది ఖాళీ చేశారు. సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియాకు ఒక గది సిద్ధం చేశారు.
రాజ్ భవన్ లో ఏర్పాట్లు
కాంగ్రెస్ సీఎం ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన కుర్చీలు, టెంట్లు, సహా ఇతరత్రా సామగ్రిని రాజ్ భవన్ కు తరలించారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్ఎంసీ సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ కార్యదర్శి రాజభవన్‌కు వెళ్లి అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేశారు.